కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌కు అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ జరగనుంది.

ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే సారథి ఎంఎస్ ధోనీపై ఉన్నాయనడంలో సందేహం లేదు. మిస్టర్ కూల్ ఎప్పుడు బరిలోకి దిగుతాడా.. అతని ఆటను ఎప్పుడు కళ్లారా చూస్తామా అంటూ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

2019 ప్రపంచకప్ తర్వాత ధోనీ టీమిండియా జెర్సీ ధరించలేదు. అలా 14 నెలలుగా మహేంద్రుడు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టలేదు. తాజాగా ఐపీఎల్‌కు గ్రీన్‌సిగ్నల్ దొరకడంతో మళ్లీ ధోని తన స్వస్థలమైన రాంచీలో నెట్స్‌లో సాధన చేస్తున్నాడు.

Also Read:ఐపీఎల్ 2020: ప్రతి 5వ రోజు కరోనా పరీక్ష

హెలికాఫ్టర్ షాట్లు త్వరలో చూస్తారని చెన్నై జట్టు స్టార్ ఆటగాడు సురేశ్ రైనా చెప్పిన తర్వాతి రోజు మహేంద్రుడు ప్రాక్టీస్ ఆరంభించడం విశేషం. ఈ విషయాన్ని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది.

గత వారం జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌కు మహీ వచ్చాడు. ఇండో ర్ స్టేడియంలో బౌలింగ్ మెషిన్‌ను ఉపయోగించి బ్యాటింగ్ సాధన చేశాడు. ఎంఎస్ ధోని ప్రణాళికలు ఏమిటో, అతను ప్రాక్టీస్ కోసం మళ్లీ ఇక్కడికి వస్తాడో లేదో తెలియదు. సాధన కోసం ఇక్కడికి రావడంతోనే ఆ విషయం మాకు తెలిసిందని ఓ అధికారి పేర్కొన్నారు.

గత వారాంతంలో రెండు రోజులు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు కానీ అప్పటి నుంచి మళ్లీ ఇక్కడికి రాలేదు. అయితే ప్రాక్టీస్ కోసం ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చి ఉండొచ్చిన ఆయన అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్‌లో పాల్గొనేందుకు గాను అన్ని జట్లు ఆగస్టు 20న అక్కడికి పయనం కానున్నాయి.