ఐపీఎల్‌ 2020 బయో సెక్యూర్‌ బబుల్‌లో జరుగనుంది. బయో బుడగలో ఇప్పటికే వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌.. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ సిరీస్‌లు జరిగినా అది కేవలం రెండు జట్లతో కూడిన బుడగ. కానీ ఐపీఎల్‌లో 8 ప్రాంఛైజీలు, క్రికెటర్లు ఇతర సిబ్బంది సంఖ్య ఎక్కువ. 

దీంతో ఐపీఎల్‌ బయో బుడగపై ఆసక్తి ఎక్కువైంది. బీసీసీఐ తాజాగా బయో సెక్యూర్‌ బబుల్‌పై స్పష్టత ఇస్తోంది. యుఏఈ విమానం ఎక్కేందుకు ప్రతి క్రికెటర్‌ తప్పనిసరిగా రెండు సార్లు కోవిడ్‌19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా రావాలి. 

24 గంటల విరామంతో రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలి. ఒకవేళ ఎవరైనా పాజిటివ్‌గా వస్తే 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలి. అనంతరం 24 గంటల విరామంతో రెండు సార్లు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. రెండు సార్లు నెగెటివ్‌గా వస్తేనే యుఏఈ విమానం ఎక్కేందుకు అనుమతి లభించనుంది. 

ఇక యుఏఈకి చేరుకున్న అనంతరం, తొలి వారం రోజులు క్రికెటర్లు ఒకరితో ఒకరు కలుసుకునేందుకు అనుమతి లేదు. అక్కడ క్రికెటర్లు అందరూ తొలి వారం రోజుల క్వారంటైన్‌లో గడుపనున్నారు. 

ఆ సమయంలో ప్రతి ఆటగాడికి మూడు సార్లు కోవిడ్‌19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేస్తారు. ఈ మూడు పరీక్షల్లో నెగెటివ్‌గా వస్తేనే ఐపీఎల్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లోకి అడుగుపెట్టనిస్తారు. లేదంటే అక్కడే 14 రోజుల క్వారంటైన్‌ అనంతరం పరీక్షలు నిర్వహిస్తారు. 

ఐపీఎల్‌ జరిగే 53 రోజుల్లో ఆటగాళ్లకు కరోనా రోగ నిర్ధారణ పరీక్షలపైనా బీసీసీఐ మార్గదర్శకాలు రూపొందించింది. ప్రతి ఐదో రోజు క్రికెటర్లు, సహాయక సిబ్బంది, ఇతర అధికారులకు కోవిడ్‌19 నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. 

ఆ నిర్ణయం ప్రాంఛైజీలదే : ఐపీఎల్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లో క్రికెటర్ల కుటుంబ సభ్యులకు ప్రవేశం ఉంటుందా? లేదా అనేది ప్రాంఛైజీలను ఇన్నాండ్లూ వేధించింది. త్వరలోనే బోర్డు కార్యదర్శి జై షాతో జరిగే సమావేశంలో అన్ని వివరాలు తెలియనున్నా.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని ప్రాంఛైజీలకే వదిలేసినట్టు బోర్డు వర్గాలు అంటున్నాయి. 

ఆటగాళ్లకు వర్తించే నిబంధనలే వారి కుటుంబ సభ్యులకు వర్తించనున్నాయి. యుఏఈలో డ్రెస్సింగ్‌రూమ్‌, ఆటగాళ్లు ఉండే ప్రాంతం, ప్రాక్టీస్‌ ప్రదేశాల్లో కుటుంబ సభ్యులకు అనుమతి ఉండదు. ఇతర క్రికెటర్ల కుటుంబ సభ్యులతో ఎన్‌95 (వాల్వ్‌ లేనిది) మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ మాట్లాడుకోవచ్చు అని బీసీసీఐ మార్గదర్శకాలు చెబుతున్నాయి. 

53 రోజుల సుదీర్ఘ ఐపీఎల్‌, అంతకముందు 3 వారాల సాధన, అంతకముందు వారం రోజుల క్వారంటైన్‌తో క్రికెటర్లు రెండు నెలలకు పైగా కుటుంబ సభ్యులకు దూరం కానున్నారు. అనంతరం భారత క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనకూ వెళ్లనున్నారు. దీంతో కుటుంబ సభ్యులను అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది.