టీం ఇండియా ప్లేయర్లు ఒకరు కాకపోతే ఒకరు చిక్కుల్లో పడుతున్నారు. చిక్కుల్లో పడుతున్నారు అని అనేకంటే...కొనితెచ్చుకుంటున్నారణాలేమో. కొన్ని నెలలుగా ఈ తతంగం నడుస్తుంది. తాజాగా ఇద్దరు వర్ధమాన ప్లేయర్లు సైతం ఇలానే చిక్కుల్లో పడ్డారు. 

భారత క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే వివాదంలో చిక్కుకున్నారు. చూడబోతుంటే చిక్కులు తప్పేలా లేవు. దేశవాళీ రంజీ ట్రోఫీ మ్యాచులో ముంబయి టీమ్ తరఫున ఆడాల్సిన ఇద్దరు క్రికెటర్లు, అనుమతి తీసుకోకుండా మ్యాచ్‌కి డుమ్మాకొట్టారు. 

Also read: ధోని వారిద్దరికీ మాత్రం తన నిర్ణయం చెప్పే ఉంటాడు : గంగూలీ

వీరి నిర్వాకంతో రైల్వేస్‌తో వాంఖడే వేదికగా మొన్న శుక్రవారం నాడు ముగిసిన మ్యాచ్‌లో ముంబయి టీం 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. రంజీ ట్రోఫీలో అగ్రశ్రేణి జట్టుగా కొనసాగుతున్న ముంబయి జట్టు ఇలా రైల్వేస్ చేతిలో ఓడిపోవడం, అందునా చీప్ గా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. 

మ్యాచ్ ముగిసిన తరువాత పోస్టుమార్టం చేసుకున్న ముంబై టీమ్ ఓటమికి కారణాల్ని వెదికే పనిలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే ఎందుకు మ్యాచ్ ఆడలేదని ఎంసీఏ ప్రశ్నించింది. 

దానికి టీమ్ యాజమాన్యం వారు రెస్ట్ తీసుకున్నట్లు కవరింగ్ ఇవ్వబోయింది. వెంటనే ఎంసీఏ అధికారులు... క్రికెటర్లు రెస్ట్ కోసం ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించగా.. ముంబయి టీమ్ మేనేజ్‌మెంట్ సరైన వివరణ ఇవ్వలేకపోయింది. 

టీం ఇండియా కోచ్ గానీ, ఫిజియో లేదా సెలక్టర్లలో ఎవరైనా ఈ క్రికెటర్ల రెస్ట్‌కి అనుమతి ఇచ్చారా? అనే కోణంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఒకవేళ శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే.లు గనుక ఎవరి నుంచి కూడా అనుమతి తీసుకోకుండా స్వయంగా ఆ నిర్ణయం తీసుకున్నట్లు తేలితే మాత్రం చర్యలు తప్పకపోవచ్చు. 

Also read: ఫాస్ట్ బౌలింగ్: ధోనీని తప్పు పట్టిన ఇషాంత్ శర్మ

వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన టీ20, వన్డే సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబేలు పాల్గొన్నారు. శ్రేయస్ అయ్యర్ దాదాపుగా నెంబర్ 4 స్థానానికి సెట్ అయినట్టే కనపడుతున్నాడు. 

వచ్చే ఏడాది జనవరి 5 నుంచి శ్రీలంకతో ప్రారంభంకానున్న టీ20 సిరీస్ కు కూడా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో గనుక ఒకవేళ ఎంసీఏ చర్యలు తీసుకుంటే ఈ యువ క్రికెటర్ల కెరీర్‌లో అదొక మాయని మచ్చలా మిగిలిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.