ధోని తనంతట తానుగా వచ్చి ఏదో ఒక విషయం చెబితే తప్ప ధోని రిటైర్మెంట్ పై ఊహాగానాలు, క్రికెట్ ప్రముఖులను మీడియా అడిగే ప్రశ్నలు ఆగవు. ఇప్పటికే ధోని భవిష్యత్తు గురించి పలుమార్లు మాట్లాడిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మరో మారు అదే విషయంపై స్పందించాల్సి వచ్చింది. 

భారత క్రికెట్‌ మిస్టర్‌ కూల్‌, మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌ ధోని భవిష్యత్‌పై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, సెలక్షన్‌ కమిటీతో కచ్చితంగా సమాచారం పంచుకునే ఉంటాడని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. ఇండియా టుడే నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Also read : కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్: ఈ దశాబ్దం చెత్త ట్వీట్ ఇదే..

జట్టు కెప్టెన్‌తో, సెలక్షన్‌ కమిటీతోనూ మహి సమాచారం పంచుకున్నాడని తాను భావిస్తున్నానని అన్నాడు. ఈ విషయంపై ఎక్కువగా ఈ వేదికపై మాట్లాడలేనని, మళ్లీ జాతీయ జట్టు తరఫున ఆడాలా? వద్దా అనేది పూర్తిగా ధోని నిర్ణయం అని గంగూలీ వ్యాఖ్యానించాడు.  

భారత క్రికెట్‌కు సంబంధించి ధోని ఎల్లప్పుడూ చాంపియనే అని, అంత త్వరగా భారత్‌కు మరో ధోని లభించడని గంగూలీ అన్నారు. టెస్టుల్లో కోహ్లిసేన గొప్పగా రాణిస్తున్నా.. 2020 టీ20 ప్రపంచకప్‌ ముంగిట 20 ఓవర్ల ఫార్మాట్‌లో మైండ్‌సెట్‌ మారాల్సిన అవసరం ఉందన్నారు. 

2019 ప్రపంచకప్‌లో కోహ్లిసేన సెమీఫైనల్స్‌కు వెళ్లిందని, టోర్నీలో వాళ్లు బాగా ఆడారని అన్నాడు. జట్టుకు దూరంగా ఉన్న తనకు ఆట తీరు పట్ల కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని, అవి వ్యక్తిగతంగా కోహ్లి, రవిశాస్త్రిలతో పంచుకుంటానని గంగూలీ అన్నాడు.  

టీ20ల్లో ఛేదనలో భారత్‌ మెరుగ్గా ఉందని, కానీ తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఇబ్బంది పడుతోందని దాదా అభిప్రాయపడ్డాడు. వీలైనంత త్వరగా ఈ సమస్యను అధిగమించాలని గంగూలీ అన్నారు. 

Also read: ఫాస్ట్ బౌలింగ్: ధోనీని తప్పు పట్టిన ఇషాంత్ శర్మ

ఇకపోతే, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో గంగూలీ శుక్రవారం సమావేశం అయ్యారు. ప్రతి క్రికెటర్‌ కూడా రిహాబిలిటేషన్ కోసం ఎన్‌సీఏకు వెళ్లాల్సిందేనని, బయటి వ్యక్తుల సహకారం తీసుకోవాలని అనుకుంటే, వారినే ఎన్‌సీఏకు రప్పించుకోవాలని గంగూలీ వ్యాఖ్యానించాడు. 

ఆటగాళ్లకు అవసరమైన అన్ని వసతులు, సదుపాయాలను బోర్డు సమకూర్చుతుందని, త్వరలోనే బెంగళూర్‌లో ఎన్‌సీఏ నూతన అకాడమీ నిర్మాణం ఆరంభం అవుతుందని, మరో 18 నెలల్లో సరికొత్త ఎన్‌సీఏను చూడబోతున్నట్టు గంగూలీ చెప్పారు.