పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ ఆ దేశంలోని దిగ్గజ క్రికెటర్లలో ఒకరు. తన దూకుడైన ఆటతీరుతో జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించిన ఆయన రిటైర్మెంట్ ప్రకటించాక కూడా పాక్‌లో క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.

ఈ క్రమంలో జాతీయ జట్టుకు కోచ్‌గా కూడా సేవలు అందించారు. అయితే ఆటగాడిగా ఉన్నప్పుడు కొనసాగించిన దూకుడును కోచ్‌గా మారినప్పడూ పాటించారు. జట్టు విజయం సాధించాలనే కసితో ఆయన పదే పదే ప్రత్యర్ధి జట్లపై నోరు పారేసుకునేవారు.

Also Read:కోహ్లీ తెల్ల జుట్టుపై కెవిన్ పీటర్సన్ ట్రోల్స్...

అలా ఆయన నోటిదురుసుతో నోచ్చుకున్న వారిలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కుటుంబం కూడా ఉందట. వివరాల్లోకి వెళితే.. 2003-04 సమయంలో భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది.

ఆ సమయంలో ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా పేస్‌ దళంలో కీలక బౌలర్. ఈ క్రమంలో పఠాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇర్ఫాన్ పఠాన్ వంటి బౌలర్లు తమ దేశంలో వీధికొకరు ఉంటారని మియాందాద్ తీవ్రమైన కామెంట్ చేశారు.

దీనికి ఇర్ఫాన్ అతని కుటుంబం తీవ్రంగా నోచ్చుకుందట. ఈ విషయాన్ని ఇర్ఫాన్ తాజాగా గుర్తుచేసుకున్నాడు. మియాందాద్ అన్న మాటలను తన తండ్రి సీరియస్‌గా తీసుకున్నారని.. ఆయనతో తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమయ్యారట.

Also Read:స్క్వేర్ కట్స్ నుండి హెయిర్ కట్స్ వరకు సచిన్ పోస్ట్.. నెటిజన్లు ఫిదా

ఏకంగా పాకిస్తాన్ వచ్చేసిన ఆయన తమ డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి.. పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళదామని పట్టుబట్టారని ఇర్ఫాన్ తెలిపాడు. తాను మియాందాద్‌ను కలిసి తీరుతానని పంతం పట్టడంతో తాను అక్కడికి వెళ్లనివ్వలేదని పఠాన్ గుర్తు చేసుకున్నాడు.

అయితే అదే సమయంలో మా నాన్నను మియాందాద్ చూశారని.... తాను మీ అబ్బాయిని ఏమీ అనలేదని, ఏ విధమైన కామెంట్ చేయలేదని చెప్పుకొచ్చారని ఇర్ఫాన్ చెప్పాడు. తన తండ్రికి ముఖం ఎర్రబడిపోయిందని.. కానీ దానిని ఓర్చుకున్న తన తండ్రి...తాను నీకు ఏమీ చెప్పడానికి రాలేదని, తాను నిన్ను కలిసి ఒక మంచి ప్లేయర్‌ అని చెబుదామని బదులిచ్చారని ఇర్ఫాన్ పఠాన్ ఆ సంగతి గుర్తుచేసుకున్నాడు.