దుబాయ్: న్యూజిలాండ్ పై జరిగిన వన్డే సిరీస్ లో జస్ప్రీత్ బుమ్రా అత్యంత చెత్త ప్రదర్శన చేశాడు. మూడు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దాంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. చాలా కాలంగా అతను అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నాడు. 

వెన్నునొప్పి నుంచి కోలుకున్న తర్వాత బుమ్రా తిరిగి టీమిండియా జట్టులోకి వచ్చాడు. అయితే, తిరిగి జట్టులో చేరిన తర్వాత అతని ప్రదర్శన ఏమంత బాగా లేదు. దీంతో ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో అతను రెండో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఈ సిరీస్ ఆడకపోయినా తొలి స్థానానికి ఎకబాకాడు. 

Also Read: కేఎల్ రాహుల్ 12వ స్థానంలో వచ్చినా....: శిఖర్ ధావన్ కామెంట్

కాగా, బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ సిరీస్ లో కోహ్లీ మొత్తం 75 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 869 పాయింట్లతో తన స్థానాన్ని కాపాడుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ పిక్క కండరాల నొప్పితో ఈ సిరీస్ కు దూరమైనా 855 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

పాకిస్తాన్ బ్యాట్స్ మన్ బాబర్ ఆజమ్ 829 పాయింట్లతో మూడు స్థానంలో నిలిచాడు. కివీస్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ 828 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. భారత్ పై జరిగిన సిరీస్ లో టేలర్ ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.

Also Read: పేపర్, సీజర్స్ , రాక్స్.. రాహుల్ తో జిమ్మీ నీషమ్ ఫన్నీ ఫోటో.. నెట్టింట వైరల్

ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఏడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో అప్ఘనిస్తాన్ క్రికెటర్ మహ్మద్ నబీ 301 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లాండు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 294 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.