న్యూఢిల్లీ: కేఎల్ రాహుల్ టిమిండియాలో కీలకమైన ఆటగాడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ కేఎల్ రాహుల్ పై ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ లో 12వ స్థానంలో వచ్చినా సెంచరీ చేయగలడని ఆయన వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ పై మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఐదో స్థానంలో వచ్చి రాహుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 

దాంతో ధావన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో .. "నీ బ్యాటింగ్ విధానం చూస్తుంటే.. 12వ స్థానంలో ఆడినా సెంచరీ సాధిస్తావు అని కామెంట్ చేశాడు. బాగా ఆడావు, అద్భుతమైన సెంచరీ బ్రదర్.. బలంగా ముందుకు సాగు.. నువ్వు బ్యాటింగ్ చేస్తున్న విధానం చూస్తుంటే 12వ ఆటగాడిగా వచ్చినా సెంచరీ చేస్తావు" అని ధావన్ అన్నాడు.

Also Read: టీమిండియా చాలా స్ట్రాంగ్, ఈ విజయం అద్భుతం.. ఆనందంలో విలియమ్సన్

న్యూజిలాండ్ పై జరిగిన మూడు వన్డేల్లో కూడా వికెట్ కీపింగ్ చేస్తూ రాహుల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ గా అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచుల్లో మొత్తం 204 పరుగులు చేసిన ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. 

అంతకు ముందు శిఖర్ ధావన్ గాయపడిన నేపథ్యంలో రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్సును ప్రారంభించి కూడా రాహుల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కేఎల్ రాహుల్ రాణించడంతో శిఖర్ ధావన్ కు పోటీ అయ్యాడనే వ్యాఖ్యలు వినిపించాయి. రాహుల్ ఐదో స్థానంలో కూడా బ్యాటింగ్ కు దిగి రాణిస్తూ ఉండడమే కాకుండా అదనంగా కీపింగ్ బాధ్యతలు కూడా చేపట్టాడు.

Also Readచెత్తగా ఏమీ ఆడలేదు కానీ....: కివీస్ పై ఓటమిపై విరాట్ కోహ్లీ స్పందన