Asianet News TeluguAsianet News Telugu

IPL Auction: విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాళ్ల వేలంలో ఇండియన్‌ క్రికెటర్లపై  ప్రాంఛైజీలు అధిక ఆసక్తి చూపలేదు. మరో ఏడాదిలో మెగా వేలానికి వెళ్లనున్న ప్రాంఛైజీలు కోల్‌కత మినీ వేలంలో జట్టులో సర్దుబాటు స్థానాలపైనే దృష్టి కేంద్రీకరించాయి.  

IPL Auction: franchises show shower crores over foreign players
Author
Kolkata, First Published Dec 20, 2019, 11:04 AM IST

కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్‌ ప్రాంఛైజీలు కురిపించిన కాసుల వర్షంలో విదేశీ క్రికెటర్లు తడిసి ముద్దయ్యారు!. ఆస్ట్రేలియా క్రికెటర్లు పాట్‌ కమిన్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, అరోన్‌ ఫించ్‌, క్రిస్‌ లిన్‌, అలెక్స్‌ క్యారె, నాథన్‌ కౌల్టర్‌నైల్‌, మిచెల్‌ మార్ష్‌లు 2020 ఐపీఎల్‌ ఆటగాళ్లలో గరిష్ట ధరను సొంతం చేసుకున్నారు. 

ఇంగ్లాండ్‌ క్రికెటర్లు ఇయాన్‌ మోర్గాన్‌, క్రిస్‌ వోక్స్‌, జసన్‌ రారు, శామ్‌ కరణ్‌లు సైతం కోటీశ్వరుల జాబితాలో చేరిపోయారు. 73 స్థానాల కోసం జరిగిన 2020 మినీ ఆటగాళ్ల వేలంలో దేశవాళీ క్రికెటర్లపై ప్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. యువ క్రికెటర్లను తీసుకునేందుకు కొన్ని ప్రాంఛైజీలు మొగ్గుచూపినా.. దక్కించుకునేందుకు పోటీ కనిపించలేదు.

ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. రూ. 15.5 కోట్ల వెచ్చించి కోల్‌కత నైట్‌రైడర్స్‌ కమిన్స్‌ను దక్కించుకుంది. డ్యాషింగ్‌ ప్లేయర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కోసం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ. 10.75 కోట్లు, క్రిస్‌ మోరిస్‌ కోసం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ రూ. పది కోట్లు ఖర్చు చేసింది. 

Also read: IPL Auction: క్రికెటర్ల కొనుగోలులో హైదరాబాద్ వ్యూహం ఇదే...

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాళ్ల వేలంలో ఇండియన్‌ క్రికెటర్లపై  ప్రాంఛైజీలు అధిక ఆసక్తి చూపలేదు. మరో ఏడాదిలో మెగా వేలానికి వెళ్లనున్న ప్రాంఛైజీలు కోల్‌కత మినీ వేలంలో జట్టులో సర్దుబాటు స్థానాలపైనే దృష్టి కేంద్రీకరించాయి.  

 కండ్లుచెదిరే ధర : 

26 ఏండ్ల ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ పంట పండింది. బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో ప్రతిష్ట కోల్పోయిన ఆస్ట్రేలియాకు తన తిరుగులేని ప్రదర్శనతో ఊరట కలిగించిన ఆటగాడు పాట్‌ కమిన్స్‌. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు వైస్‌ కెప్టెన్సీ సైతం దక్కించుకున్న పాట్‌ కమిన్స్‌ ఈ ఏడాది అత్యుత్తమ ఆటగాడిగా క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక అలెన్‌ బోర్డర్‌ అవార్డును గెల్చుకున్నాడు. 

20 ఓవర్ల ఆటలో మెరుగైన ఎకానమీ, ఆకర్షణీయమైన స్ట్రయిక్‌రేట్‌ పాట్‌ కమిన్స్‌ సొంతం. మిచెల్‌ స్టార్క్‌, జోశ్‌ హెజిల్‌వుడ్‌లతో కూడిన ఆసీస్‌ పేస్‌ దళానికి నాయకత్వం వహిస్తోన్న పాట్‌ కమిన్స్‌పై కోల్‌కత నైట్‌రైడర్స్‌ మనసు పడింది. 

ఆటగాళ్ల వేలంలో కమిన్స్‌ కోసం కోల్‌కత ఏకంగా రూ. 15.5 కోట్లు వెచ్చించింది. 12 ఏండ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకూ ఏ విదేశీ ఆటగాడు అందుకోని రికార్డు ధరను పాట్‌ కమిన్స్‌ సొంతం చేసుకున్నాడు. గాయాలతో సుమారు ఆరు సీజన్ల పాటు టెస్టు క్రికెట్‌కు దూరమైన పాట్‌ కమిన్స్‌.. రిహాబిలిటేషన్ లో గొప్ప ఫిట్‌నెస్‌ సాధించాడు. రెండు సార్లు ఐపీఎల్‌ విజేత కోల్‌కత నైట్‌రైడర్స్‌కు వచ్చే సీజన్‌లో బౌలింగ్‌ సారథిగా కమిన్స్‌ వ్యవహరించనున్నాడు.

హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయారు... 

మినీ వేలంలో విదేశీ ఆటగాళ్లపై ప్రాంఛైజీలు తీరని మోజు కనబరిచాయి. మానసిక ఒత్తిడితో జాతీయ జట్టు నుంచి తప్పుకుని విరామం తర్వాత తిరిగి మైదానంలోకి వచ్చిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను తిరిగి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాజ్‌ తీసుకుంది. 

గత సీజన్‌లో మాక్స్‌వెల్‌ ఐపీఎల్‌లో ఆడలేదు. మాక్స్‌వెల్‌ మెరుపులతో ఓ సారి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ టైటిల్‌కు చేరువగా వెళ్లింది. రూ. 10.75 కోట్లతో మాక్స్‌వెల్‌ను పంజాబ్‌ సొంతం చేసుకుంది. 

పేస్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున స్ఫూర్తివంతమైన ప్రదర్శన చేశాడు. బలహీనమైన పేస్‌ విభాగాన్ని పటిష్టం చేసుకునే క్రమంలో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ మోరిస్‌ను కొనుక్కుంది. ఇతర ప్రాంఛైజీల పోటీని తట్టుకుని రూ. 10 కోట్లను మోరిస్‌ను తీసుకుంది. పదునైన ఆఫ్‌ కట్టర్‌లు, 

Also read: ఐపిఎల్ కు హైదరాబాద్ కుర్రాడు: ఎవరీ సందీప్?

తెలివైన బౌలింగ్‌తో టీ20 క్రికెట్‌లో షెల్డన్‌ కాట్రెల్‌ అతి విలువైన ఆటగాడిగా మారిపోయాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సెల్యూట్‌ స్టార్‌ కోసం రూ. 8.5 కోట్లు ఖర్చు చేసింది. కాట్రెల్‌ కోసం ప్రాంఛైజీలు పోటీపడినా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అతడి కోసం చివరి వరకూ బిడ్‌ దాఖలు చేసింది. 

మరో ఆస్ట్రేలియా పేసర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ సైతం కండ్లుచెదిరే ధర దక్కించుకున్నాడు. ముంబయి ఇండియన్స్‌ రూ. 8 కోట్లతో నాథన్‌ కౌల్టర్‌నైల్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌ యువ ఆల్‌రౌండర్‌, నాణ్యమైన పేసర్‌ సామ్ కరణ్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ తీసుకుంది. 

తక్కువ డబ్బుతో వేలానికి వచ్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ అవసరమైన ఆటగాళ్ల కోసమే వెళ్లింది. రూ. 5.5 కోట్లతో కరణ్‌ను కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్‌ను వరల్డ్‌ చాంపియన్‌గా నిలిపిన ఇయాన్‌ మోర్గాన్‌ ఐపీఎల్‌లో పునరాగమనం చేశాడు. రూ. 5.25 కోట్లతో కోల్‌కత నైట్‌రైడర్స్‌ మోర్గాన్‌ను సొంతం చేసుకుంది. 

కోల్‌కత వదులుకున్న విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ను రూ. 2 కోట్ల కనీస ధరకు ముంబయి ఇండియన్స్‌ తీసేసుకుంది. ఇంగ్లాండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్ 1.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోయాడు. 

ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ను రూ. 4.4 కోట్లతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తీసుకుంది. అలెక్స్‌ క్యారె రూ. 2.4 కోట్లకు, క్రిస్‌ వోక్స్‌ రూ. 1.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ తీసుకుంది. 

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ డెవిడ్‌ మిల్లర్‌ను రూ. 75 లక్షల కనీస ధరకు రాజస్థాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ ను కనీస ధర 50 లక్షలకు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు వెళ్లగా.. జోశ్‌ హెజిల్‌వుడ్‌ కనీస ధర రూ. 2 కోట్లకు చెన్నై గూటికి చేరాడు. 

పేస్‌ ఆల్‌రౌండర్‌, ఫినిషర్‌ మిచెల్‌ మార్ష్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తీసుకుంది. కనీస ధర రూ.2 కోట్లకు హైదరాబాద్‌ ఆసక్తి చూపగా.. మిగతా ప్రాంఛైజీల నుంచి ఎటువంటి పోటీ ఎదురు కాలేదు. 

వెస్టిండీస్‌ యువ విధ్వంసకారుడు షిమ్రోన్‌ హెట్‌మయర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ కోట్ల వర్షం కురిపించింది. కనీసం ధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన హెట్‌మయర్‌పై ప్రాంఛైజీలు ఆసక్తి చూపించాయి. 

రాజస్థాన్‌ రాయల్స్‌ హెట్‌యమర్‌ను మిలియనీర్‌ చేయగా ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 7.75 కోట్లలో కరీబియన్‌ కుర్రాడిని తీసుకుంది. క్రిస్‌ జోర్డాన్‌ను రెండో రౌండ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ. 3 కోట్లకు తీసుకుంది.

దుమ్ము రేపిన యువ భారతం... 

యువ ఆటగాళ్లపై ఈ ఏడాది వేలంలో ఆసక్తి ఉంటుందని ముందే అంతా ఊహించారు. భారత అండర్‌-19 ప్రపంచకప్‌ కెప్టెన్‌ ప్రియాం గార్గ్‌, ఉత్తర ప్రదేశ్‌ యువ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ సింగ్‌లను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకుంది. ఇద్దరు కనీస ధర రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చారు. 

చెరో రూ.1.9 కోట్లతో హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. హైదరాబాద్‌ ఆటగాడు బి. సందీప్‌ను రూ. 20 లక్షలకు సన్‌రైజర్స్‌ రెండో రౌండ్‌లో తీసుకుంది.

Also read: IPL Auction 2020: పానీపూరీ అమ్మేవాడు, కోటీశ్వరుడయ్యాడు

అనుజ్‌ రావత్‌ను రూ. 80 లక్షలకు, ఆకాశ్‌ సింగ్‌ను రూ. 20 లక్షలకు, కార్తీక్‌ త్యాగిని రూ. 20 లక్షలకు రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. 

సౌరభ్‌ తివారి కనీస ధర రూ. 50 లక్షలకు ముంబయి ఇండియన్స్‌కు వెళ్లాడు. రవి బిష్ణోయ్ కనీస ధర రూ. 20 లక్షలకు వేలంలోకి రాగా, 2 కోట్లకు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అతడిని తీసుకుంది. 

సిద్దార్థ్‌, ఇషాన్‌ పొరెల్‌లను రూ. 20 లక్షలకు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ దక్కించుకుంది. అండర్‌-19 యువ కెరటం యశస్వి జైస్వాల్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడనున్నాడు జైస్వాల్‌ కోసం రాయల్స్‌ రూ. 2.4 కోట్లు వెచ్చించింది. 

విలక్షణ మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి వేలంలో గరిష్ట మొత్తం దక్కించుకున్నాడు. రూ. 4 కోట్లకు కోల్‌కత సొంతమయ్యాడు. పియుశ్‌ చావ్లా వేలంలో ఊహించని ధరను దక్కించుకున్నాడు. చెన్నై చెపాక్‌ స్పిన్‌ స్నేహిత పిచ్‌. అక్కడ చావ్లా అవసరం అవుతాడని భావించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 6.75 కోట్లతో తీసుకుంది. జైదేవ్‌ ఉనద్కత్‌ను మరోసారి రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 3 కోట్లకు తీసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios