IPL 2025 LSG vs RCB: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. జితేష్ శర్మ సూపర్ నాక్ తో మరో ఓవర్ మిగిలి వుండగానే 228 పరుగుల టార్గెట్ ను అందుకుంది.

IPL 2025 LSG vs RCB: ఐపీఎల్ 2025 సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్ అద్భుతంగా సాగింది. ఇరు జట్లు పరుగుల వర్షం కురిపించాయి. రిషబ్ పంత్ సెంచరీ తో లక్నో భారీ స్కోర్ చేసింది. జితేష్ శర్మ సూపర్ నాక్ తో ఆర్సీబీ మరో ఓవర్ మిగిలి వుండగానే విజయాన్ని అందుకుంది. 

లక్నో టీమ్ మొదట బ్యాటింగ్ చేసి 227/3 పరుగులు చేసింది. ఆర్సీబీ 18.4 ఓవర్లలోనే 230/4 పరుగులతో టార్గెట్ ను అందుకుని విజయాన్ని అందుకుంది. దీంతో ఐపీఎల్ 2025లో టాప్ 2లోకి ఆర్సీబీ చేరింది. క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఇక్కడ గెలిస్తే నేరుగా ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుంటుంది.

జితేష్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్

228 పరుగుల భారీ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. ఫిల్ సాల్ట్ 30 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 54 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. పాటిదార్, లివింగ్ స్టోన్ త్వరగానే అవుట్ కావడంతో ఆర్సీబీ కష్టాల్లో పడినట్టు కనిపించింది. కానీ, క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మలు మ్యాచ్ ను ఆర్సీబీ వైపు తీసుకువచ్చారు. 

అగర్వాల్ 23 బంతుల్లో 41 పరుగులతో చివరి వరకు క్రీజులో ఉన్నాడు. తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు బాదాడు. జితేష్ శర్మ లక్నోను పిచ్చకొట్టుడు కొట్టాడు. లక్నో బౌలింగ్ ను ఉతికిపారేశాడు. కేవలం 33 బంతుల్లోనే 85 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. తన సూపర్ నాక్ లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. 257 స్ట్రైక్ రేటుతో జితేష్ శర్మ బ్యాటింగ్ కొనసాగింది. 

ఆర్సీబీపై రిషబ్ పంత్ సెంచరీ

ముందు బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ చేయడంలో రిషబ్ పంత్ సెంచరీ సహాయపడింది. రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చిన వెంటనే దూకుడుగా ఆడుతూ 55 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో తన ఐపీఎల్ కెరీర్‌లో రెండవ సెంచరీని సాధించాడు. మరో ఎండ్‌లో మిచెల్ మార్ష్ కూడా సూపర్ నాక్ ఆడాడు. కేవలం 37 బంతుల్లో 67 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.