Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2023: ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లకు భారీ బందోబస్తు.. ఆ వస్తువులపై నిషేధం..

ఐపీఎల్-16వ సీజన్ సందడి శనివారం మొదలైంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 7 మ్యాచ్‌లు జరగనున్నాయి.

IPL 2023 Elaborate security arrangements for match at Uppal stadium and these items not allowd to carry inside ksm
Author
First Published Apr 1, 2023, 5:15 PM IST

ఐపీఎల్-16వ సీజన్ సందడి శనివారం మొదలైంది. ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 2వ తేదీన ఆదివారం మొదటి మ్యాచ్ సన్‌ రైజర్స్ హైదరాబాద్‌–రాజస్థాన్ రాయల్స్‌ మధ్య జరగనుంది. మే 18న ఉప్పల్ స్టేడియంలో చివరి మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే పోలీసు అధికారులు ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 

ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తు ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పల్ స్టేడియంలో జరిగే అన్ని మ్యాచ్‌లకు భద్రతా ఏర్పాట్లపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా తెలంగాణ పోలీసుల వివిధ విభాగాల నుంచి సుమారు 1500 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు తెలిపారు. విధ్వంస నిరోధక తనిఖీలతో పాటు 340 నిఘా కెమెరాలతో భద్రతను పెంచనున్నట్టుగా తెలిపారు. 
ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించాడానికి క్విక్ రియాక్షన్ టీమ్స్ అందుబాటులో ఉంచుతున్నట్టుగా తెలిపారు. అవసరమైనప్పుడు తక్షణ చర్య తీసుకోవడానికి అన్ని సీసీటీవీ ఫుటేజీలను పర్యవేక్షించడానికి జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడిందని చెప్పారు. ప్రతి మ్యాచ్ పూర్తయ్యే వరకు విధ్వంస నిరోధక తనిఖీలు నిరంతరాయంగా నిర్వహించబడతాయని తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా మహిళలపై వేధింపులకు దిగేవారిపై నిఘా ఉంచేందుకు షీ టీమ్స్‌ను రంగంలోకి దింపనున్నట్టుగా చెప్పారు. 

ఏదైనా ఆకస్మిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు, అంబులెన్స్‌లు, ఫైర్ టెండర్‌లను స్టేడియంలో ఉంచనున్నట్టుగా తెలిపారు. స్టేడియం, చుట్టుపక్కల వ్యూహాత్మక ప్రదేశాల్లో సాయుధ పోలీసులను మోహరిస్తామని చెప్పారు.

డే మ్యాచ్‌ల కోసం.. స్టేడియం గేట్లు మ్యాచ్‌కు మూడు గంటల ముందు తెరవబడతాయని చెప్పారు. రాత్రి మ్యాచ్‌లకు సాయంత్రం 4.30 గంటల నుంచి ప్రేక్షకులను లోనికి అనుమతిస్తామని చెప్పారు. ప్రేక్షకులు నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే వాహనాలను పార్క్ చేయాలని  స్పష్టం చేశారు. మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడంపై కూడా పోలీసులు ఆంక్షలు ప్రకటించారు.

 

ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిల్స్,  కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మ్యాచ్ బాక్స్ / లైటర్లు, పదునైన మెటల్ / ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యులర్స్, రైటింగ్ పెన్స్,  బ్యాటరీలు, హెల్మెట్లు, పెర్‌ఫ్యూమ్, బ్యాగ్‌లు,  బయట తినుబండారాలు తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios