విశాఖపట్నం: వెస్టిండీస్ తో విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో ఇండియా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ ముందు 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచి, ఒత్తిడికి గురి చేసింది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ సెంచరీలు చేయడమే కాకుండా కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. దీంతో భారత్ 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 

గత చివరి మూడు మ్యాచుల్లో వాంఖడే మ్యాచుతో పాటు రెండు వన్డేల్లో మొదటి దశలో తాము బాగా బ్యాటింగ్ చేశామని, సెకండ్ బ్యాటింగ్ పెద్ద సమస్య కాదని, టాప్ సైడ్స్ లో తమ జట్టు ఒకటి అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. టాస్ ఓడిన తర్వాత తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పటికీ తాము ఆడిన తీరు బాగుందని, టాస్ పై తాము ఆధారపడదలుచుకోలేదని ఆయన అన్నాడు. 

Also Read: విశాఖలో రోహిత్ శర్మ వీరంగం...విండీస్ పై హుద్ హుద్ తరహా బీభత్సం

ఎప్పుడు కూడా 40-50 పరుగులు అదనంగా చేసి ప్రత్యర్థిని ఓడించాలనేది తమ ఉద్దేశ్యమని ఆయన అన్నాడు. రోహిత్, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడారని, ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఆడిన తీరు కూడా అద్భుతంగా ఉందని కోహ్లీ ప్రశంసించాడు 

విశాఖ వన్డేలో 34 బౌండరీలు, 16 సీక్సులు కొట్టడాన్ని బట్టి వచ్చే టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఆడారా అని మీడియా ప్రశ్నిస్తే టీ20ల్లో తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే విశ్వాసాన్ని కూడగట్టుకోవడం మంచిదని, ప్రధానమైన 50 ఓవరు మ్యాచులు లేవని, భయం వీడి ఆడడమే ఇప్పుడు కావాల్సిందని కోహ్లీ జవాబిచ్చాడు. 

Also Read: హ్యాట్రిక్స్: ఆ రికార్డు కుల్దీప్ యాదవ్ సొంతం

గత రెండు మ్యాచుల్లో ఫీల్డింగ్ సరిగా లేకపోవడమే బాధిస్తోందని ఆయన అన్నాడు. ఆటలోని అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రమాణాలను సాధించడమే కావాల్సిందని అన్నాడు. రివ్యూలను చాలా వరకు వికెట్ కీపర్, బౌలర్లకు మాత్రమే వదిలేస్తున్నామని, రివ్యూలు తీసుకున్న తీరుపై తాను అంత సంతృప్తిగా లేనని అన్నాడు. క్యాచింగ్ అసంతృప్తిగానే ఉందని చెప్పాడు. 

ఫీల్డింగ్ బాగా చేయాల్సి ఉంటుందని, క్యాచ్ లను జారవిడచడం సరి కాదని కోహ్లీ అన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసే జట్టులో తమది ఒకటని అన్నాడు. ఫీల్డింగ్ సరిగా లేకపోవడానికి కారణమేమిటని అడిగితే ఫీల్డింగ్ అనేది బంతిని ఒడిసిపట్టుకోవడానికి సంబంధించిందని, దాన్ని మనం ఎంజాయ్ చేయగలిగితే ఫీల్డింగ్ మెరుగవుతుందని అన్నాడు. 

నెంబర్ 4 బ్యాట్స్ మన్ నిలకడగా ఆడకపోతే లాభం ఉండదని, యువకుడు శ్రేయాస్ అయ్యర్ స్వేచ్ఛగా ఆడుతుండడం తమకు ఆనందాన్ని కలిగిస్తోందని కోహ్లీ అన్నాడు.