కలిసివచ్చిన కంచుకోటలో కోహ్లిసేన కదం తొక్కింది. బ్యాట్‌తో, బంతితో కరీబియన్లను చిత్తుగా కొట్టిన టీమ్‌ ఇండియా విశాఖలో 107 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ 1-1తో సమం చేసి నిర్ణయాత్మక పోరు వేదికను  కటక్‌కు మార్చింది. 

అమ్మమ్మ ఊరులో రోహిత్‌ శర్మ (159) హ్యాట్రిక్‌ సెంచరీతో చెలరేగాడు. దక్షిణాఫ్రికాతో టెస్టులో రెండు శతకాలు సాధించిన రోహిత్‌ తాజాగా విండీస్‌పై మరో భారీ శతకంతో మెరిశాడు. ఓపెనర్‌గా కెఎల్‌ రాహుల్‌ (102) విస్మరించలేని ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. శ్రేయస్ అయ్యర్‌ (53), రిషబ్‌ పంత్‌ (39) ధనాధన్‌లతో రాణించగా విశాఖ వన్డేలో భారత్‌ 387 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Also read: IPL Auction 2020: ఖర్చు కాస్త ఎక్కువైనా పర్లేదు.. టాప్ ప్లేయర్స్ పై కన్నేసిన సన్ రైజర్స్!

చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌ వికెట్ల మ్యాజిక్‌, మహ్మద్‌ షమి వరుస వికెట్ల విన్యాసం ఛేదనలో వెస్టిండీస్‌ను వెనక్కి లాగింది. హోప్ (78), నికోలస్‌ పూరన్‌ (75) పోరాడినా ఛేదనలో ఆ జట్టు 280 పరుగులకే కుప్పకూలింది.

రోహిత్‌ శర్మ (159, 138 బంతుల్లో 17 ఫోర్లు 5 సిక్స్‌లు) విశాఖలో హ్యాట్రిక్‌ సెంచరీతో మెరిశాడు. కెఎల్‌ రాహుల్‌ (102, 104 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఓపెనర్‌గా సూపర్‌ సెంచరీ సాధించగా.. శ్రేయస్ అయ్యర్‌ (53, 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) వరుసగా నాల్గో అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. 

యువ విధ్వంసకారుడు రిషబ్‌ పంత్‌ (39, 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ మెరుపులు మెరిశాడు. రోహిత్‌, రాహుల్‌, అయ్యర్‌, పంత్‌ మెరుపులతో వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత్‌ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

తొలుత 387 పరుగుల భారీ స్కోరు చేసిన టీమ్‌ ఇండియా.. ఛేదనలో వెస్టిండీస్‌ను 280 పరుగులకు కుప్పకూల్చింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ హోప్ (78, 85 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్‌ పూరన్‌ (75, 47 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరిసినా విండీస్‌కు ఓటమి తప్పలేదు. 

కుల్దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌ వికెట్లు, షమి మూడు వికెట్ల ప్రదర్శనతో వెస్టిండీస్‌ ఛేదనను ఛిద్రం చేశారు. రోహిత్‌ శర్మ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు సాధించాడు. సిరీస్‌లో మూడో వన్డే ఆదివారం కటక్‌లో జరుగుతుంది.

విశాఖలో హిట్ మాన్ షో...  

టాస్‌ నెగ్గిన వెస్టిండీస్‌ ఛేదనకు మొగ్గు చూపింది. అమ్మమ్మ ఊరులో కెఎల్‌ రాహుల్‌ (102) జతగా రోహిత్‌ శర్మ (159) తిరుగులేని ఆరంభం అందించాడు. తొలి పది ఓవర్లలో ఆచితూచి ఆడిన ఓపెనర్లు పవర్‌ ప్లేలో 55 పరుగులే చేశారు. 

రోహిత్‌ శర్మ నెమ్మదిగా ఆడగా, రాహుల్‌ దూకుడు చూపించాడు. కట్‌ షాట్లతో చెలరేగిన రాహుల్‌ మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 46 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిసిన రోహిత్‌ 56 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ చేరుకున్నాడు. 

అర్ధ సెంచరీ తర్వాత సైతం రోహిత్‌ శర్మ తనదైన వేగం అందుకోలేదు. మరో ఎండ్‌లో రాహుల్‌ ఎడాపెడా బౌండరీలు బాదటంలో రోహిత్‌పై ఒత్తిడి లేకుండా పోయింది. 20 ఓవర్లలో 100 పరుగుల మార్క్‌ దాటిన భారత్‌.. తర్వాతి 30 ఓవర్లలో విశ్వరూపం చూపించింది. 

రోహిత్‌ శర్మ 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 107 బంతుల్లో కెరీర్‌ 28వ వన్డే సెంచరీ సాధించగా.. రాహుల్‌ 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 102 బంతుల్లో కెరీర్‌ 3వ వన్డే శతకం సాధించాడు. శతకం తర్వాత రాహుల్‌ నిష్క్రమించాడు. 

విశాఖలో కండ్లుచెదిరే రికార్డులున్న విరాట్‌ కోహ్లి (0) కీరన్‌ పొలార్డ్‌ స్లో డెలివరికి తొలి బంతికే వికెట్‌ కోల్పోయాడు. శ్రేయస్ అయ్యర్‌ (53) జతగా రోహిత్‌ శర్మ చెలరేగాడు. శతకం తర్వాత ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన రోహిత్‌ 25 బంతుల్లోనే 100 నుంచి 150కి చేరుకున్నాడు. రోహిత్‌ మెరుపులతో భారత్‌ భారీ స్కోరు దిశగా సాగింది. మరో ద్వి శతకం దిశగా సాగిన రోహిత్‌ శర్మ 159 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 

పంత్‌, అయ్యర్‌ ధనాధన్‌... 

టాప్‌ ఆర్డర్‌ బలమైన పునాది వేయటంతో ఆఖర్లో రిషబ్‌ పంత్‌, శ్రేయస్ అయ్యర్‌ ధనాధన్‌ ముగింపు అందించారు. పంత్‌, అయ్యర్‌ మెరుపులతో ఆఖరి 60 బంతుల్లో భారత్‌ 127 పరుగులు పిండుకుంది. 

Also read: విశాఖలో సెంచరీ...రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డ్

రోస్టన్‌ ఛేజ్‌ వేసిన ఓ ఓవర్లో శ్రేయాష్‌ అయ్యర్‌ నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్ తో చెలరేగగా.. అంతకముందు షెల్డన్‌ కాట్రెల్‌, అల్జారీ జొసెఫ్‌లపై రిషబ్‌ పంత్‌ నాలుగు సిక్సర్లు బాదాడు. పంత్‌ 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో వేగంగా పరుగులు పిండుకున్నాడు. 

నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదిన అయ్యర్‌ 28 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఆఖరి ఓవర్‌లో కేదార్‌ జాదవ్‌ (16 నాటౌట్‌) హ్యాట్రిక్‌ బౌండరీలతో జట్టు స్కోరును 400కు చేరువ చేశాడు. 

వెస్టిండీస్‌ బౌలర్లను భారత బ్యాట్స్ మెన్ ఉతికి ఆరేశారు. షెల్డన్‌ కాట్రెల్‌ (2/83), కీమో పాల్‌ (1/68), రోస్టన్‌ ఛేజ్‌ (0/48), కీమో పాల్‌ (1/57) ధారాళంగా పరుగులు సమ ర్పించుకున్నారు. రెండో వికెట్ సాధించాక కట్రెల్ పెట్టె సెల్యూట్ లో జోష్ కూడా పోయిందంటే...భారత బ్యాట్స్ మెన్ ఎంతలా విండీస్ బౌలర్లను ఊచకోత కోసారో అర్థం చేసుకోవచ్చు.

ఆ ఇద్దరు మెరిసినా.. ఈ ఇద్దరు కూల్చారు : 

388 పరుగుల రికార్డు లక్ష్యం. మంచు ప్రభావం, బిగ్‌ హిట్టర్ల అండతో వెస్టిండీస్‌ ఆశలు సజీవంగానే నిలిచాయి. ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌ (30), హోప్‌ (78) తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించి శుభారంభం అందించారు. 

దీంతో విండీస్‌ గట్టి పోటీ ఇచ్చేలానే కనిపించింది. ఫామ్‌లో ఉన్న షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (4), రోస్టన్‌ ఛేజ్‌ (4)లను స్వల్ప విరామంలో కోల్పోయిన విండీస్‌ ఒత్తిడిలో పడింది. ఈ దశలో  హోప్ తో కలిసి నికోలస్‌ పూరన్‌ (75) విండీస్‌ను రేసులోకి తీసుకొచ్చాడు. 

నాల్గో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారు. ఈ సమయంలో సీమర్‌ మహ్మద్‌ షమి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. జోరు మీదున్న పూరన్‌, విధ్వంసక కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ (0)లను వరుస బంతుల్లో అవుట్‌ చేశాడు. 

192/3తో పటిష్టంగా కనిపించిన విండీస్‌ షమి దెబ్బకు 192/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కొద్దిసేపటికే చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌ వికెట్ల మ్యాజిక్‌తో విండీస్‌ ఓటమి ఖాయం చేశాడు. 

చైనా మాన్ హాట్ ట్రిక్... 

ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్‌ హోప్ ను డీప్‌ మిడ్‌ వికెట్‌లో బౌండరీ లైన్‌ వద్ద కోహ్లి క్యాచ్‌తో అవుట్‌ చేసిన కుల్దీప్‌ తొలి వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. తర్వాతి బంతికి జేసన్‌ హోల్డర్ (11)ను స్టంపౌట్‌ ద్వారా రెండో వికెట్‌ తీసుకున్నాడు. రెండో స్లిప్స్‌లో జాదవ్‌ క్యాచ్‌తో అల్జారీ జొసెఫ్‌ (0)ను సాగనంపి హ్యాట్రిక్‌ పూర్తి చేశాడు. 

వన్డేల్లో రెండు సార్లు హ్యట్రిక్‌ వికెట్లు తీసిన భారత బౌలర్‌ గా కుల్దీప్‌ యాదవ్‌ రికార్డు సృష్టించాడు. 2017లో ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్‌ సాధించిన కుల్దీప్‌ విశాఖలో విండీస్‌పై వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. చేతన్‌ శర్మ, కపిల్‌ దేవ్‌, మహ్మద్‌ షమిలు సైతం భారత హ్యాట్రిక్‌ వికెట్ల క్లబ్‌లో ఉన్నారు.  

ఆశల్లేని మ్యాచ్‌లో కీమో పాల్‌ (46, 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారత విజయాన్ని ఆలస్యం చేశాడు. పాల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన షమి విశాఖలో ఘన విజయాన్ని పూర్తి చేశాడు....