వెస్టిండిస్ పర్యటనలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో విజయానికి చేరువయ్యింది. టీ20, వన్డే సీరిస్ లను క్లీన్ స్వీప్  చేసినట్లుగానే టెస్ట్ సీరిస్ ను కూడా క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే  మొదటి టెస్ట్ లో తిరుగులేని ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకున్న కోహ్లీసేన చివరి టెస్ట్ లో కూడా గెలుపుకు మరింత చేరువయ్యింది. 

రెండో టెస్ట్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా  416 పరుగులు సాధించగా విండీస్ కేవలం 117 పరుగులకే చేతులెత్తేసింది. 87/7 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను  ఆరంభించిన విండీస్ కొద్దిసేపటికే మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ కు 299 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 

వెస్టిండిస్ ను ఫాలో ఆప్ ఆడించే అవకాశమున్నా కోహ్లీ అలా చేయలేదు. రెండో ఇన్నింగ్స్ ను168/4 వద్ద డిక్లేర్ చేసిన తర్వాత మళ్లీ విండీస్ కు బ్యాటింగ్ ను అప్పగించాడు. ఇలా మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యానికి మరికొన్ని పరుగులు జోడించి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టడంలో టీమిండియా సఫలమయ్యింది. 

మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 2 వికెట్లు కోల్పోయి 45 పరుగుల వద్ద నిలిచింది. అయితే ఆ జట్టు ఇంకా 423 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. రమరో  రెండురోజుల ఆట మిగిలివున్నప్పటికి 8 వికెట్లతో ఈ  లక్ష్యాన్ని ఛేదించడం  దాదాపు అసాధ్యమని చెప్పాలి. కాబట్టి టీమిండియా విజయం ఖాయంగా  కనిపిస్తోంది. ఇలా కేవలం వెస్టిండిస్ జట్టుపైనే కాదు టెస్ట్ ఛాంపియన్ షిప్ లోనూ భారత్ కు మంచి ఆధిక్యం లభించనుంది.    

సంబంధిత వార్తలు

కింగ్‌స్టన్ టెస్ట్: 117 పరుగులకే విండీస్ ఆలౌట్... టీమిండియా ఆధిక్యం 299