వెస్టిండిస్ జట్టు మరో ఓటమికి మెళ్లిగా చేరువవుతోంది. రెండో టెస్ట్ మొదటి  ఇన్నింగ్స్ భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు కేవలం 117 పరుగులకే  కుప్పకూలింది. దీంతో కోహ్లీసేన 299 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. అయితే వెస్టిండిస్ ను ఫాలోఆన్ ఆడించే అవకాశమున్నప్పటికి టీమిండియా రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించడానికే మొగ్గుచూపింది. 

విండీస్ 7 వికెట్ల నష్టానికి 87 పరుగులతో రెండో రోజు ఆటను  ముగించిన విషయం తెలిసిందే. ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన కార్న్ వాల్(14 పరుగులు),రోచ్(17 పరుగులు) కాస్సేపు పోరాడారు. చివరకు ఈ జోడిని 97 పరుగుల వద్ద షమీ విడగొట్టాడు. ఆ తర్వాత  117 పరుగుల వద్దే హమిల్టన్, రోచ్ లు లు కూడా ఔటవడంతో విండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. హమిల్టన్ ను ఇషాంత్ శర్మ, రోచ్ ను రవీంద్ర జడేజా ఔట్ చేశారు. 

ఇలా మొదటి ఇన్నింగ్స్ లో 299 పరుగుల ఆధిక్యం లభించినప్పటికి టీమిండియా రెండో ఇన్నింగ్స్ వైపే మొగ్గుచూపింది. ఆ ఆధిక్యానికి మరికొన్ని పరుగులు జోడించడం ద్వారా ఆతిథ్య జట్టును మరింత ఒత్తిడిలోకి నెట్టాలన్నిది కెప్టెన్ కోహ్లీ ఆలోచనగా కనిపిస్తోంది. 

రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వికెట్ ను కోల్పోయింది. రోచ్ బౌలింగ్ లో అగర్వాల్(4 పరుగుల) ఎల్బీగా ఔటయ్యాడు. దీంతో భారత్ 9 పరుగుల వద్దే మొదటి వికెట్ కోల్పోయింది.