స్థలం: ముంబయి వాంఖడే మైదానం. 

సందర్భం : 2016లో టీ20 ప్రపంచకప్‌.  

భారత్‌ కు ప్రపంచ కప్ ను దూరం చేస్తూ విండీస్‌ చెలరేగిన మైదానం. మూడేండ్ల తర్వాత మరోసారి ఈ రెండు జట్లు అదే వేదికపై సమరానికి సై అంటున్నాయి. టీ20 సిరీస్‌ను దక్కించుకునేందుకు ఈసారి ఇరు జట్లు అమీతుమీకి దిగుతున్నాయి. 

వాంఖడే తర్వాత వరల్డ్‌ చాంపియన్‌గా అవతరించిన వెస్టిండీస్‌.. ఇప్పుడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి 20 టైటిల్‌ నిలుపుకోవాలనే ఉబలాటం కరీబియన్‌ శిబిరంలో కనిపిస్తోంది.

ఎప్పటికప్పుడు నూతన టార్గెట్స్ ను సెట్ చేసుకుంటూ, స్వీయ సవాళ్లు నిర్దేశించుకుంటూ అగ్రశ్రేణి జట్టుగా ఎదిగిన కోహ్లిసేన నేడు వాంఖడేలో మరో పరీక్ష ఎదుర్కొనుంది. లక్ష్యం నిర్దేశించినా, భారీ ఛేదనకు బరిలోకి దిగినా సత్తా చాటాల్సిన అవసరం వచ్చేసింది. వరుసగా మరో టీ20 సిరీస్‌పై కన్నేసిన కోహ్లిసేన నేడు విధ్వంసక వెస్టిండీస్‌ను నిర్ణయాత్మక టీ20లో ఢీ కొంటుంది. 

Also read: ధోనిపై విరాట్‌కున్న అభిమానం: గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019గా మారింది

హైదరాబాద్‌లో భారత్‌, వెస్టిండీస్‌ నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. కరీబియన్లు మెరుగ్గా ఆడినా, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విరోచిత విన్యాసాలు మ్యాచ్‌ను విండీస్ చేతుల్లోంచి అమాంతం లాగేసుకుంది. తిరువనంతపురంలో కోహ్లిసేన తక్కువ స్కోరు, ఫీల్డింగ్‌ తప్పిదాలు కరీబియన్‌ శిబిరానికి కలిసొచ్చాయి. 

ఇప్పుడు సీన్‌ ముంబయికి చేరుకుంది. 1-1తో సమవుజ్జీలుగా నిలిచిన భారత్‌, వెస్టిండీస్‌ కప్పు వేటలో అమీతుమీ తేల్చుకునేందుకు వాంఖడే చేరుకున్నాయి. భారీ స్కోర్ల వాంఖడేలో టీ20 సమరం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. పరుగుల పోటీలో బౌండరీలు బాదే సామర్థ్యం ఇరు జట్ల విజయావకాశాలను తేల్చనుంది.

టీ20 ఫార్మాట్‌లో టీమ్‌ ఇండియా కొంతకాలంగా తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు భారీ స్కోరు సాధనలో ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనే విషయమై ప్లానింగ్ కొరవడింది. తిరువనంతపుర టీ20లో ఈ సమస్యను కొంత గట్టెక్కినట్టే కనిపించింది. బ్యాటింగ్‌ లైనప్‌లో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుని ఓ అడుగు ముందుకేసింది. 

భారీ హిట్టర్‌ శివం దూబెను నం.3 స్థానంలో పంపటం తిరువనంతపురంలో పని చేసింది. విధ్వంసక బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ సేవలను సైతం మెరుగైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే స్కోరు బోర్డుపై మరిన్ని ఎక్కువ పరుగులు చూడవచ్చు. 

బ్యాటింగ్‌ లైనప్‌లో కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌, శివం దూబె రెండు మ్యాచుల్లో మెరిశారు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ నుంచి తనదైన ఇన్నింగ్స్‌ రావాల్సి ఉంది. ఐపీఎల్‌ సొంతమైదానంలో రోహిత్‌ శర్మ స్పెషల్‌ ఇన్నింగ్స్‌ ఆడతాడేమో చూడాలి. 

Also read: నో సెలబ్రేషన్స్... ఓన్లీ సైలెన్స్: కోహ్లీ ఔటయ్యాక ఓవరాక్షన్ చేయని కరేబీయన్లు

శ్రేయస్ అయ్యర్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడేందుకు ఎదురు చూస్తున్నాడు. బౌలింగ్‌ విభాగంలో వాషింగ్టన్‌ సుందర్‌పై ఒత్తిడి కనిపిస్తోంది. క్యాచులు వదిలేసిన సుందర్‌ మానసికంగా ఒత్తిడిలో పడ్డాడు. పవర్‌ప్లేలో స్పిన్‌ బౌలర్‌గా వాషింగ్టన్‌ మంచి మార్కులే కొట్టేసినా.. ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలకు జట్టు మూల్యం చెల్లించుకుంది. 

దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ పరుగుల పొదుపు పాటించటం లేదు. పరుగుల వరద పారే వాంఖేడేలోనైనా, క్రమశిక్షణతో బంతులేస్తే బ్యాట్స్‌మెన్‌ శ్రమను తగ్గించినవారవుతారు!.

తూ మార్ మై మార్...దంచికొట్టుడే!

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏ స్థానంలో ఉన్నా.. టీ20 ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ విశ్వసించే ఏకైక ఫార్ములా బాదుడు. నేడు సిరీస్‌ నిర్ణయాత్మక పోరులోనూ కరీబియన్లు అదే ఫార్ములాను నమ్ముకోనున్నారు. ముంబయి ఇండియన్స్‌ తరఫున వాంఖడేలో ఎన్నో మ్యాచుల అనుభవం గడించిన కీరన్‌ పొలార్డ్‌, సిమోన్స్‌లు విండీస్‌కు కీలకం కానున్నారు. 

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) హీరోలు బ్రాండన్‌ కింగ్‌, హెడెన్‌ వాల్ష్‌ ఎక్స్‌ ఫ్యాక్టర్‌ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎవిన్‌ లెవిస్‌, హెట్మయర్‌, నికోలస్‌ పూరన్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు.

అలవోకగా సిక్సర్లు బాదే విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ నేడు సైతం అదే పనిగా బౌండరీలపై ధ్యాస పెట్టనున్నారు. బౌలింగ్‌ విభాగంలో కాస్రిక్‌ విలియమ్స్‌, షెల్డన్‌ కాట్రెల్‌ ఆకట్టుకుంటున్నారు. జేసన్‌ హోల్డర్‌, పియరీ నుంచి సహకారం లభిస్తే విండీస్‌ బౌలింగ్‌ బృందం మరింత ప్రభావశీలంగా కనిపించనుంది.

పిచ్‌ రిపోర్టు

ముంబయి ఎప్పుడు పరుగుల వరదకు సిద్ధమై ఉంటుంది. మంగళవారం సాయంత్రం సైతం పిచ్‌పై రోలింగ్‌ చేశారు. నేడు సైతం మరో సారి రోలింగ్‌ చేసారు. ఐపీఎల్‌లో సహా అంతర్జాతీయ టీ20ల్లో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు ఎంత భారీ స్కోరు చేసినా, ఆఖరు బంతి వరకూ విజయంపై దీమా ఉండదు!. నేడు సిరీస్‌ నిర్ణయాత్మక సమరంలోనూ ముంబయి పిచ్‌ అదే రీతిలో స్పందించనుంది. సిరీస్‌ విజేతను బౌండరీలు బాదే సామర్థ్యం నిర్దేశించనుంది.

టాస్‌ పాత్ర ఏ మేర ఉండబోతుంది...? 

టీ20 మ్యాచుల్లో టాస్‌ చాలా కీలకం. ప్రత్యేకించి భారత్‌, వెస్టిండీస్‌ సిరీస్‌లో టాస్‌ అత్యంత కీలక భూమిక వహిస్తోంది. నిజానికి తొలి రెండు టీ20లు టాస్‌ నెగ్గిన జట్టు సొంతమయ్యాయి.

భారత్‌, వెస్టిండీస్‌లు ఛేదనలో ఆరితేరిన జట్లు. కొండంత లక్ష్యం ముందున్నా బెదరకుండా కొట్టేయగల బ్యాట్స్‌మెన్‌ ఇరు జట్ల సొంతం. ఇరు జట్లకు కూడా ఒకే రకం సమస్యగా మారడం ఇక్కడొక ఆసక్తికరమైన అంశం.  

తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు ఆశించిన స్కోరు చేయలేకపోవటం ఇరు జట్లనూ వేధిస్తోన్న సమస్య. 200 పైచిలుకు స్కోర్లకూ భద్రత దక్కని ముంబయి పిచ్‌పై మళ్లీ టాస్‌ ప్రధానం కానుంది. టాస్‌ నెగ్గిన ఛేదనకు మొగ్గుచూపనుంది.  

తుది జట్లు (అంచనా) :

భారత్‌ : రోహిత్‌ శర్మ, కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, శివం దూబె, రిషబ్‌ పంత్‌, శ్రేయాష్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, యుజ్వెంద్ర చాహల్‌.
వెస్టిండీస్‌ : లెండ్లి సిమోన్స్‌, ఎవిన్‌ లెవిస్‌, బ్రాండన్‌ కింగ్‌, షిమ్రోన్‌ హెట్మయర్‌, నికోలస్‌ పూరన్‌, కీరన్‌ పొలార్డ్‌, జేసన్‌ హౌల్డర్‌, కారే పీరే, కాస్రిక్‌ విలియమ్స్‌, షెల్డన్‌ కాట్రెల్‌, హెడెన్‌ వాల్ష్‌.