Virat Kohli 100th Test Match: ఇది సోషల్ మీడియా యుగం. ఎవరైనా ఏదైనా చెబితే చాలు.. అందుకు సంబంధించిన ఏ సమాచారమైనా క్షణాల్లో మన ముందుంటుంది. వందో టెస్టులో కోహ్లి.. ద్రావిడ్ తో తాను చిన్నప్పుడు ఫోటో తీయించుకున్నానని చెప్పాడు. అంతే.. కొద్దిసేపట్లోనే అది వైరల్ అయింది.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి ఇవాళ ప్రత్యేకమైన రోజు. మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు విరాట్ కోహ్లికి కెరీర్ లో వందో టెస్టు. భారత్ తరఫున వందో టెస్టు ఆడుతున్న 12వ క్రికెటర్ కోహ్లి. ఈ సందర్భంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అతడిని ఘనంగా సత్కరించింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. కోహ్లిని సత్కరించాడు. ఈ సందర్భంగా కోహ్లి.. తన చిన్ననాటి హీరో దగ్గర్నుంచి ఈ సత్కారం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. ద్రావిడ్ తో తాను అండర్-15 స్థాయిలో ఆడుతున్నప్పుడు తీసుకున్న ఫోటో ఇప్పటికీ తన ఇంట్లో ఉందని చెప్పాడు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది.
ద్రావిడ్ తో కోహ్లి దిగిన ఫోటోను ఐపీఎల్ లో అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసింది. ద్రావిడ్ తో చిన్ననాటి కోహ్లిని.. ఇప్పుడు వందో టెస్టు సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ నుంచి జ్ఞాపికను అందుకుంటున్న విరాట్ ఫోటోను జతకలిపి.. ‘ఎలా మొదలై.. ఎలా కొనసాగుతున్నది...’ అని రాసుకొచ్చింది.
కాగా కోహ్లిని ద్రావిడ్ సత్కరిస్తూ.. ‘ఈ ఘనతను సాధించడానికి నువ్వు అర్హుడవు. అందుకోసం ఎంతో కష్టపడ్డావు. రాబోయే రోజుల్లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలి. ఈ వందో టెస్టు నీకు కొత్త ఆరంభం కావాలి. భవిష్యత్తులో 200 టెస్టులు ఆడాలి..’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ద్రావిడ్ నుంచి సత్కారం అందుకున్న సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ.. ‘నా చిన్ననాటి హీరో ద్రావిడ్ నుంచి టెస్టు జ్ఞాపికను అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు ప్రత్యేకమైన సందర్భం. నేను అండర్-15 ఆడేప్పుడుకు మీ (ద్రావిడ్)తో దిగిన ఫోటో ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. ఇప్పుడు నా వందో టెస్టులో మళ్లీ మీ నుంచి టెస్టు క్యాప్ అందుకున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణం ఇంకా కొనసాగాలని ఆశిస్తున్నాను..’ అని తెలిపాడు.
కాగా.. ఆర్సీబీ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. ద్రావిడ్ తో కోహ్లి దిగిన ఈ రెండు ఫోటోలను చూసిన అభిమానులు.. ‘అలా మొదలై, ఇక్కడిదాకా వచ్చింది.. గొప్ప ప్రయాణం.. ఈ జర్నీ ఇంకా కొనసాగాలి విరాట్..’ అంటూ విషెస్ చెబుతున్నారు.
ఇదిలాఉండగా.. లంకతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ చేస్తాడని ఆశించిన కోహ్లి అభిమానులకు నిరాశే మిగిలింది. అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య క్రీజులోకి అడుగుపెట్టిన కోహ్లి.. 76 బంతుల్లో 45 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి ఐదు పరుగులు దూరంలో ఔటయ్యాడు. ఇన్నింగ్స్ ను సాధికారికంగానే ప్రారంభించిన కోహ్లి.. ఎంబుల్డెనియా వేసిన ఇన్నింగ్స్ 43.3 వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. దీంతో విరాట్ అభిమానుల గుండె పగిలింది. ఇక ఈ టెస్టులో 56 ఓవర్లు ముగిసేటప్పటికీ భారత్ 4 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. హనుమ విహారి (58) హాఫ్ సెంచరీ చేశాడు. రిషభ్ పంత్ (17 బ్యాటింగ్), శ్రేయాస్ అయ్యర్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లంక స్పిన్నర్ ఎంబుల్డెనియ రెండు వికెట్లు పడగొట్టాడు.
