Ashwin all set to Overtake Kapil Dev: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు లంకతో జరుగబోయే సిరీస్ కీలకం కానున్నది.  మరో ఐదు వికెట్లు తీస్తే అతడు భారత క్రికెట్ దిగ్గజం... 

ఈనెల 4 నుంచి శ్రీలంకతో జరుగబోయే తొలి టెస్టులో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. మొహాలీ వేదికగా జరుగబోయే తొలి టెస్టులో అతడు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రికార్డుపైనే గురి పెట్టాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే అశ్విన్.. కపిల్ దేవ్ సరసన నిలుస్తాడు. టెస్టు భారత్ లోనే జరుగుతుండటంతో అశ్విన్ ఈ రికార్డు సాధించడం పెద్ద విషయమేమీ కాదు. అదీగాక స్వదేశంలో అతడికి గొప్ప రికార్డు కూడా ఉంది. 

టెస్టు క్రికెట్ లో ఇప్పటివరకు 430 వికెట్లు తీసుకున్నాడు అశ్విన్. ఇక కపిల్ దేవ్.. 434 వికెట్లతో కొనసాగుతున్నాడు. అయితే ఇన్ని వికెట్లు తీయడానికి కపిల్ కు 131 టెస్టులు అవసరం పడగా.. అశ్విన్ మాత్రం 84 టెస్టులలోనే 430 వికెట్లు సాధించాడు.

కపిల్ దేవ్ తో పాటు మరికొన్ని రికార్డులను కూడా ఈ సిరీస్ లో అశ్విన్ అధిగమించే అవకాశం ఉంది. ప్రస్తుతం 430 వికెట్లతో ఉన్న అశ్విన్.. మరో రెండు వికెట్లు తీస్తే న్యూజిలాండ్ దిగ్గజం సర్ రిచర్డ్ హ్యాడ్లీ (86 టెస్టులలో 431 వికెట్లు) ని.. మూడు వికెట్లు తీస్తే శ్రీలంక వెటరన్ స్పిన్నర్ రంగనా హెరాత్ (93 టెస్టులలో 433 వికెట్లు) ను కూడా అధిగమించొచ్చు. 

Scroll to load tweet…

టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలతో లంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత షేన్ వార్న్ (708 వికెట్లు), జేమ్స్ అండర్సన్ (640) ఉన్నారు. ఆ తర్వాత భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (619 వికెట్లు) ఉన్నాడు. ఈ జాబితాలో అశ్విన్ ప్రస్తుతం 12 వ స్థానంలో ఉన్నాడు. లంకతో సిరీస్ లో కనీసం ఏడెనిమిది వికెట్లు పడగొట్టినా టాప్-10లో చేరుతాడు.

అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు : 

- అనిల్ కుంబ్లే : 619 వికెట్లు 
- కపిల్ దేవ్ : 434 వికెట్లు 
- అశ్విన్ : 430 వికెట్లు 
- హర్భజన్ సింగ్ : 417 వికెట్లు 
- ఇషాంత్ శర్మ : 311 వికెట్లు 

హర్భజన్ రికార్డుపైనా.. 

కపిల్, హ్యాడ్లీ, హెరాత్ లతో పాటు టర్భోనేటర్ హర్భజన్ సింగ్ రికార్డును కూడా అశ్విన్ కన్నేశాడు. లంకపై భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో అనిల్ కుంబ్లే (18 మ్యాచులు 73 వికెట్లు) అగ్రస్థానంలో ఉంటే.. ఆ తర్వాత హర్భజన్ (16 మ్యాచులు 53 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక అశ్విన్.. 9 టెస్టులలోనే 50 వికెట్లు తీశాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే అతడు భజ్జీని అధిగమిస్తాడు. 

స్పిన్ తో పాటు బ్యాటింగ్ లో కూడా మెరుపులు మెరిపించే అశ్విన్.. మరో 166 పరుగులు చేస్తే టెస్టు క్రికెట్ లో 3 వేల పరుగులు చేసిన క్రికెటర్ అవుతాడు. ప్రస్తుతం అశ్విన్.. 84 టెస్టులలో 2,844 రన్స్ చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.