శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే సాధ్యపడింది. ఇండోర్‌ మ్యాచ్‌లో భారత్‌ నెగ్గటం విశేషం కాదు. కానీ ద్వితీయ శ్రేణి సీమర్లు ముందుండి జట్టును నడిపించిన తీరు భారత్‌కు గొప్ప సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు.  

బుమ్రా రీ ఎంట్రీ మ్యాచ్‌లో షార్దుల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైనిలు బంతితో దాడి చేశారు. శ్రీలంక బ్యాటింగ్‌ శిబిరం వెన్నులో వణుకు పుట్టించారు. బ్యాటింగ్‌ లైనప్‌లోనూ భారత్‌ కొత్త ఆలోచనను ఆచరణలో పెట్టింది. శ్రేయస్ అయ్యర్‌ను నం.3లో ఆడించటం సానుకూల ఫలితాన్ని అందించింది. టీ20 వరల్డ్‌కప్‌ జట్టు కూర్పు ప్రణాళికలు పుణెలో కూడా కొనసాగనున్నాయి. 

Also read: ఓపెనర్స్ బిగ్ ఫైట్: రాహుల్, ధావన్ లలో నిలిచేదెవరు...?

స్వదేశంలో టీమ్‌ ఇండియాది తిరుగులేని విజయ ప్రస్థానం. కానీ చివరి మూడు టీ20ల్లో కోహ్లిసేన కనీసం ఓ మ్యాచ్‌లో భంగపడింది. సొంతగడ్డపై సిరీస్‌ కోల్పోని రికార్డు కోహ్లిసేన సొంతమయినప్పటికీ... ఓ మ్యాచ్‌లో ఓడిపోయిన చరిత్రను భారత్ కలిగి ఉండడం శ్రీలంక శిబిరంలో కొత్త ఉత్సాహం నింపుతోంది. విజయం కోసం బరిలోకి దిగేందుకు వారికిప్పుడు ఈ విషయం ఒక బూస్ట్ లాగ పనిచేస్తుంది.  

పాకిస్థాన్‌పై 3-0 విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో, భారత్‌పైన కూడా సత్తా చాటుతామనే నమ్మకం తొలుత లంక క్యాంపులో కనిపించింది. కానీ ఇండోర్‌ మ్యాచ్‌ తర్వాత ఇరు జట్ల మధ్య అగాధం పూడ్చలేనిదనే విషయం డ్రెస్సింగ్‌రూమ్‌కు స్పష్టంగా తెలిసిపోయింది. 

2020 టీ20 ప్రపంచకప్‌కు శ్రీలంక నేరుగా అర్హత సాధించలేదు. ఈ సమయంలో యువ ఆటగాళ్ల నుంచి లసిత్‌ మలింగ స్ఫూర్తివంతమైన ప్రదర్శన ఆశిస్తున్నాడు. స్పిన్‌ స్వర్గధామం పుణెలో నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20 సమరం సాయంత్రం ఏడూ గంటలకు ప్రారంభమవనుంది. 

ధావన్‌పై స్పష్టమైన ఒత్తిడి...  

భారత జట్టులో ఒత్తిడి లేకుండా ఆడుతూ పాడుతూ ఆడే ఆటగాడు శిఖర్‌ ధావన్‌. మైదానంలో ధావన్‌ ఆట తీరుతో ఈ విషయం ఎన్నోసార్లు చాటి చెప్పాడు. కెరీర్‌లో తొలిసారి ధావన్‌ ఒత్తిడిలో పడినట్టు కనిపిస్తున్నాడు. అతడి బ్యాటింగ్‌ శైలిలో ఆ ఒత్తిడి కనిపిస్తోంది. 

బౌలర్లపై ఎదురుదాడి చేసే గబ్బర్‌, ఇండోర్‌లో వికెట్ల మధ్య పరుగులకు ప్రాధాన్యం ఇచ్చాడు. బౌండరీలతో సహచర బ్యాట్స్‌మన్‌కు ఒత్తిడి దూరం చేసే ధావన్‌.. ఇండోర్‌లో కొత్తగా తను ఒత్తిడి తగ్గించుకునే పనిలో పడిపోయాడు. 

32 పరుగుల ఇన్నింగ్స్‌లో ధావన్‌ కేవలం రెండు ఫోర్లు మాత్రమే సాధించాడు. మరోవైపు ఓపెనర్‌ రేసులో తనతో పోటీపడుతున్న కెఎల్‌ రాహుల్‌ అర డజను బౌండరీలతో శ్రీలంక బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. 

కేవలం ఒక్క ఇన్నింగ్స్‌ తోనే టీ20 వరల్డ్‌కప్‌లో ధావన్‌ ప్రాధాన్యత, తుది జట్టులో చోటు నిర్ణయించలేము. అలాగని, రానున్న మ్యాచుల్లో స్ట్రయిక్‌రేట్‌, నిలకడ నిరూపించుకోకపోతే ఆస్ట్రేలియా విమానం ఎక్కే అవకాశం ధావన్ చేజారే ప్రమాదం కూడా లేకపోలేదు. నం.3లో శ్రేయస్ అయ్యర్‌ ప్రయోగం పుణెలోనూ కొనసాగనుంది. సంజు శాంసన్‌, మనీశ్‌ పాండేలకు తుది జట్టులో చోటు లభించే అవకాశం లేదు.

మాథ్యూస్‌ ఆగమనం లంక గతి మార్చేనా...?

వాస్తవానికి ఇండోర్‌ పిచ్‌ పరుగుల వరదకు చిరునామా. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై 140 కిమీ వేగంతో దూసుకొచ్చే బంతులు ఆడేందుకు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ ఆపసోపాలు పడ్డారు. 

ధనంజయ డిసిల్వ అవుటైన తర్వాత డగౌట్‌లో లసిత్‌ మలింగ ముఖంలో అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనబడింది. శ్రీలంక ఆటగాళ్లు వికెట్లు చేజార్చుకుంటున్న తరుణంలో మలింగా విస్మయం వరుసగా వ్యక్తం చేస్తుండడం ఆ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికీ తెలిసిందే. 

Also read: కెప్టెన్ గా కోహ్లీ వరల్డ్ రికార్డు... టీ20ల్లో అరుదైన ఘనత

సీనియర్‌ ఆటగాడు ఎంజెలో మాథ్యూస్‌కు భారత్‌పై టీ20ల్లో ఘనమైన రికార్డు ఉంది. ఇండోర్‌ మ్యాచ్ లో మాథ్యూస్‌ ఆడలేదు. నేడు పుణెలో మాథ్యూస్‌ బరిలోకి దిగనున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాథ్యూస్‌ చివరి మ్యాచుల్లో వరుసగా 113, 48, 52, 87 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. 

కొత్త బంతితో ప్రభావశీల బౌలర్‌గా మాథ్యూస్‌ ఉపయోగపడగలడు. ఛేదనలో ప్రశాంతమైన ఫినీషర్‌గా, డెత్‌ ఓవర్లలో మలింగతో కలిసి బౌలింగ్‌ చేయగల సీమర్‌గా మాథ్యూస్‌ శ్రీలంకకు ఒక మంచి ఆల్ రౌండర్. 

యువ ఆటగాళ్లు హసరంగ, డిసిల్వ, శనక, అవిష్కలు రాణించాల్సిన అవసరం ఉంది. వికెట్‌ కీపర్‌ కుశాల్‌ పెరీరా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడి నుంచి లంక భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది.

పిచ్‌, వెదర్ కండిషన్స్ 

పూణేలో  జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ చాలా స్వల్ప స్కోరు మాత్రమే చేసింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ను 101 పరుగులకే శ్రీలంక ఆలౌట్‌ చేసింది. నేటి మ్యాచ్‌ లో బ్యాట్‌ కి, బంతికి మధ్య  పోటీ ఉండేలా పిచ్‌ను సిద్ధం చేశారు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. టాస్‌ నెగ్గిన జట్టు ఛేజింగ్ కు దిగనుంది. 

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా) 

భారత్‌ : శిఖర్‌ ధావన్‌, కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్ అయ్యర్‌, విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌, శివం దూబె, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, షార్దుల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్ బుమ్రా.

శ్రీలంక : ధనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ పెరీరా, భానుక రాజపక్సె, ఒషాడ ఫెర్నాండో, ఎంజెలో మాథ్యూస్‌, దసున్‌ శనక, ధనంజయ డిసిల్వ, వానిందు హసరంగ, లసిత్‌ మలింగ, లహిరు కుమార.