India Vs South Africa: క్రికెట్ లో అంపైర్లుగా వ్యవహరించేవాళ్లు ఎంతో సంయమనం, ఓర్పుతో ఉండాల్సి ఉంటుంది. ఇరు జట్ల ఆటగాళ్లను సముదాయించి ఆటను సజావుగా సాగేలా చూడాలి. అయితే ఈ క్రమంలో వాళ్లు కూడా  ఒక్కోసారి  సహనం కోల్పోతారు.

సాధారణంగా క్రీడల్లో క్రీడాకారుల ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. మిగతా క్రీడలను కాసేపు పక్కనబెట్టి క్రికెట్ లో చూసుకుంటే ఇండియా-పాకిస్థాన్, ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాలు ఆడే హై ఓల్టేజీ గేమ్స్ లో అయితే అవి ఆకాశానికి అంటుతాయి. ఈ సందర్భంలో ఆయా మ్యాచులకు అంపైర్లుగా వ్యవహరించేవాళ్లు ఎంతో సంయమనం, ఓర్పుతో ఉండాల్సి ఉంటుంది. ఇరు జట్ల ఆటగాళ్లను సముదాయించి ఆటను సజావుగా సాగేలా చూడాలి. అయితే ఈ క్రమంలో వాళ్లు కూడా ఒక్కోసారి సహనం కోల్పోతారు. టీమిండియా-దక్షిణాప్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో కూడా సౌతాఫ్రికా అంపైర్ మరైస్ ఎరాస్మస్ ది దాదాపు అదే పరిస్థితి.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టుతో పాటు ఆతిథ్య ఆటగాళ్లు కూడా ప్రత్యర్థి బ్యాటర్లు ఔటైనప్పుడు పదే పదే అప్పీల్స్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో భాగంగా భారత ఆటగాళ్లు ఔట్ కోసం అప్పీల్ చేయడంతో ఎరాస్మస్ టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి.. ‘మీరు నాకు గుండెపోటు తెప్పించేలా ఉన్నారు...’ అంటూ గొణిగాడు. ఆయన అన్న ఆ మాటలు వికెట్లకు అమర్చిన మైక్ లో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో భాగంగా.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ చేస్తుండగా ఎరాస్మస్ ఇలా ఫ్రస్టేట్ అయ్యాడు. ఠాకూర్ వేసిన రెండు వరుస బంతులు డీన్ ఎల్గర్ ప్యాడ్లకు తాకాయి. దాంతో అతడు.. ఎల్బీడబ్ల్యూగా అప్పీల్ చేశాడు. కానీ దానికి ఎరాస్మస్ ఔట్ గా ప్రకటించలేదు. ఇదే గాక నిన్నటి మ్యాచులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, దక్షిణాఫ్రికా యువ పేసర్ జాన్సేన్ మధ్య వాగ్వాదం జరిగింది. 

Also Read : Ind Vs SA: ఈ సౌతాఫ్రికా అంపైర్.. మన రత్నగిరి రత్నమే.. అల్లావుద్దీన్ మూలాలు ఇక్కడే..

టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో భాగంగా జాన్సేన్ 53వ ఓవర్ లో తొలి బంతిని జాన్సేన్ బౌన్సర్ గా సంధించడంతో అది కాస్తా బుమ్రా భుజానికి తాకింది. అప్పుడే జాన్సేన్ ఏదో అనగా బుమ్రా.. భుజం దగ్గర దులుపుకుంటూ ‘చాల్లే వెళ్లు...’ అన్నట్టుగా సైగ చేశాడు. ఇక ఆ తర్వాత బంతిని కూడా జాన్సేన్ అదే మాదిరిగా విసిరాడు. దీనిని షాట్ గా మలచడంలో విఫలమైన బుమ్రా చేతికి మరోసారి బంతి తాకింది. అయితే ఈసారి కూడా జాన్సేన్.. బుమ్రాను చూస్తూ ఏదో అన్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బుమ్రా.. నేరుగా జాన్సేన్ దగ్గరకు వెళ్లి.. మాటల యుద్దానికి దిగాడు. ఇద్దరూ కలిసి కొట్టుకునేంత పని చేశారు. అక్కడే ఉన్న ఫీల్డ్ అంపైర్లతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లు వచ్చి వారికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. 

ఠాకూర్ వరుసగా అప్పీల్స్ చేయడం.. బుమ్రా, జాన్సేన్ ల గొడవతో అంపైర్ ఎరాస్మస్ కూడా సహనం కోల్పోయాడు. ఇక వీళ్లతో వేగడం తన వల్ల కాదనుకున్నాడో ఏమో గానీ.. ‘ప్రతి ఓవర్ కు మీరు నాకు గుండెపోటు తెప్పించేలా ఉన్నారు..’ అంటూ తనలో తానే అనుకున్నాడు.