India Vs South Africa: వాండరర్స్ టెస్టులో తన నిర్ణయాలతో  అందరి మన్ననలు పొందుతున్న  సౌతాఫ్రికా అంపైర్ అల్లావుద్దీన్ పాలేకర్  మూలాలు భారత్ లోనే ఉన్నాయి. వాళ్లది అంపైర్ల ఫ్యామిలీ..

టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య జోహన్నస్బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అంపైర్ గా విధులు నిర్వర్తిస్తున్న South Africa అంపైర్ అల్లావుద్దీన్ పాలేకర్ మూలాలు భారత్ లోనే ఉన్నాయి. తన అంపైరింగ్ కెరీర్ లో Allahudien Palekar తొలిసారి టెస్టులకు అంపైర్ గా వ్యవహరిస్తున్నాడు. మంచి నిర్ణయాలతో అందరి మన్ననలు పొందుతున్న పాలేకర్ పూర్వీకుల మూలాలు India లోవే. అతడి తండ్రి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. అల్లావుద్దీన్ పాలేకర్ గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం. 

పాలేకర్ తండ్రి జమాలుద్దీన్ ది Maharashtraలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తాలుకాలోని శివ్ గ్రామం. ఆ ఊరిలో పాలేకర్ కుటుంబాలదే ఆధిపత్యం. ఉద్యోగం రిత్యా జమాలుద్దీన్ సౌతాఫ్రికా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అల్లావుద్దీన్ అక్కడే జన్మించాడు. అతడు దక్షిణాఫ్రికాలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడాడు. ఆ తర్వాత అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్లది అంపైర్ల ఫ్యామిలీ గా గుర్తింపు పొందింది. జమాలుద్దీన్ కూడా పలు ఫస్ట్ క్లాస్ మ్యాచులకు అంపైర్ గా విధులు నిర్వర్తించాడు. 

ఇదే విషయమై శివ్ గ్రామాధిపతి (సర్పంచ్) దుర్వేశ్ పాలేకర్ మాట్లాడుతూ.. ‘నేను కూడా పాలేకర్ నే. అతడి (అల్లావుద్దీన్) మూలాలు ఈ గ్రామంలోనివే. అల్లావుద్దీన్ తండ్రి ఉద్యోగం కోసం సౌతాఫ్రికా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అల్లావుద్దీన్ సౌతాఫ్రికాలోనే జన్మించినా అతడి మూలాలు మాత్రం శివ్ గ్రామంలోనివే. అతడిని చూసి మేమందరం గర్విస్తున్నాం. మా ఊరిపేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు...’ అని తెలిపాడు. 

రంజీలకు అంపైర్ గా.. 

భారత్ లో మూలాలు ఉండటమే కాదు.. పాలేకర్ భారత్ లో జరిగే దేశవాళీ రంజీ మ్యాచుకు కూడా అంపైర్ గా వ్యవహరించడం విశేషం. 2014-15 సీజన్ లో వాంఖడే స్టేడియంలో ముంబై-మధ్యప్రదేశ్ మధ్య జరిగిన రంజీ మ్యాచుకు అంపైర్ గా ఉన్నాడు.మరో భారత అంపైర్ కృష్ణమచారి శ్రీనివాసన్ తో కలిసి అతడు అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. ‘అంపైర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా అతడు ముంబై-మధ్యప్రదేశ్ ల మధ్య జరిగిన రంజీ మ్యాచుకు అంపైర్ గా పనిచేశాడు’ అని ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. పాలేకర్ అంపైర్ గా ఉన్న ఈ మ్యాచులోనే టీమిండియా ప్రస్తుత యువ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ లు సెంచరీలతో కదం తొక్కడం విశేషం. 

ఇదిలాఉండగా.. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు ఓటమి అంచున ఉంది. టీమిండియా నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సఫారీ బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. టీమిండియా.. సఫారీల ముందు నిలిపిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆ జట్టు మరో 122 పరగులు సాధించాలి. చేతిలో మరో 8 వికెట్లు, రెండ్రోజుల ఆట మిగిలుండటంతో సఫారీలు విజయంపై ధీమాగా ఉన్నారు. వాండరర్స్ లో భారత్ ఇప్పటివరకు ఓడిపోలేదు.