కరోనా వైరస్ కారణంగా దేశ ప్రజలు హోలీ పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. వైరస్ వల్ల సహజ సిద్ధమైన రంగులనే జనం ఎక్కువగా ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కలవరపాటు కలిగిస్తుండటంతో ఈ సారి హోలీ జరుపుకోవడం లేదని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.

ఆయన పిలుపుమేరకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఆడంబరంగా రంగులు జరుపుకోకుండా పసుపు, కుంకుమ ఇతర రంగులు చల్లుకుంటున్నారు. టీమిండియా క్రికెటర్లు సైతం తమ కుటుంబసభ్యులతో కలిసి హోలీ పండుగను జరుపుకున్నారు.

 

 

భారత విధ్వంసక ఆటగాడు హార్డిక్ పాండ్యా తనకు కాబోయే సతీమణి నటాషా స్టాంకోవిచ్‌తో కలిసి హోలీ జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో పెట్టాడు. ఈ ఫోటోలలో హార్డిక్ పాండ్యాతో పాటు అతని సోదరుడు క్రునాల్ పాండ్యా కూడా ఉన్నాడు.

సుమారు ఐదు నెలల విరామం తర్వాత హార్డిక్ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇటీవల దేశవాళీ టీ20 మ్యాచ్‌లో 55 బంతుల్లో 158 పరుగులు చేయడంతో పాటు డీవై పాటిల్ టీ20 కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి తన ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు.

 

 

వెన్నునొప్పి బాధిస్తుండటంతో హార్డిక్ పాండ్యా కొద్దిరోజుల క్రితం లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. 26 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ బెంగళూరులో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ అతను పాల్గొనలేదు.

 

 

ఈ నెలాఖరులో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 13 సీజన్‌ ప్రారంభం కావడానికి ముందు టీమిండియా.. దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్- చెన్నై సూపర్‌ కింగ్స్ తలపడతాయి.