అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాక్  సెమీఫైనల్స్ లో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాక్ ... భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. టీమిండియా 10వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని రంగాల్లోనూ అదరగొట్టిన టీమిండియా మ్యాచ్ ను ఏకపక్షం చేసేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 172 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్‌ను ఓటమి కోరల్లోకి నెట్టేసిన వాటిలో ఖాసిం అక్రమ్ (9) రనౌట్ ఒకటి. పాక్ త్వరత్వరగా రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ ఓపెనర్ హైదర్ అలీతో కలిసి కెప్టెన్ రోహైల్ నజీర్ 62 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. 96 పరుగుల వద్ద హైదర్ అలీ (56) జైస్వాల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కొత్త బ్యాట్స్‌మన్ ఖాసిం అక్రమ్ క్రీజులోకి వచ్చాడు.

Also Read తొలి వన్డే: పరువు కోసం కివీస్... గెలవటం అలవాటైన భారత్...
 
రవి బిష్ణోయ్ వేసిన 31వ ఓవర్ మూడో బంతిని ఎదుర్కొన్న ఖాసిం అక్రమ్.. సింగిల్ తీసే విషయంలో కొంత గందరగోళానికి గురయ్యాడు. నజీర్ సగం దూరం వచ్చాక వెనక్కి మళ్లాడు. మరోవైపు, ఖాసిం కూడా ముందుకే పరిగెత్తడంతో ఇద్దరూ నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌కు చేరుకున్నారు. ఈలోపు బంతి అందుకున్న అథర్వ అంకోలేకర్ దానిని తెలివిగా వికెట్ కీపర్‌కు అందించాడు. ధ్రువ్ జురెల్ వికెట్లను గిరాటేశాడు. దీంతో పాక్ 118 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
 
ఇప్పుడీ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. పాక్ రనౌట్ల చరిత్రను గుర్తుకు తెస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘పాకిస్థాన్ ఎప్పటికీ పాకిస్థానే. కొన్ని అలవాట్లు ఎప్పటికీ మారవు’ అని ఒకరంటే.. ‘ఇది ట్రేడ్ మార్క్ రనౌట్. గతంలో ఇలాంటివి ఎన్ని చూడలేదూ..’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. పాకిస్థాన్ ప్రదర్శన తాత్కాలికమేనని, కానీ రనౌట్లు మాత్రం శాశ్వతమని మరికొరు ఎద్దేవా చేశారు.