IND VS NZ : నేడు కోహ్లీ బ్యాట్ పడితే చాలు... సచిన్, ధోనిల మరో రికార్డ్ బద్దలు
నేడు వాంఖడే స్టేడియంలో జరిగే ప్రపంచ కప్ సెమీస్ ఆడటం ద్వారాా విరాట్ కోహ్లీ దిగ్గజ క్రికెటర్లు సచిన్, ధోని మరో రికార్డును బద్దలుకొట్టనున్నాడు.
ముంబై : స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ మెగాటోర్నీలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. గ్రౌండ్ ఎక్కడైనా... ప్రత్యర్థి ఎవరైనా సరే కోహ్లీ పరుగుల ప్రవాహం మాత్రం ఆగడంలేదు. ఇక నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న సెమి ఫైనల్లో కోహ్లీ మరిన్ని రికార్డులు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. పరుగుల,సెంచరీల రికార్డులు అటుంచితే కేవలం ఈ సెమీస్ ఆడటం ద్వారా సరికొత్త రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట నమోదు కానుంది.
వన్డే ప్రపంచ కప్ లో వరుసగా నాలుగుసార్లు సెమీ ఫైనల్ ఆడిన ఏకైక భారత ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు. 2011 లో ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో కోహ్లీ కూడా వున్నాడు. ఆ తర్వాత వరుసగా 2015,2019 లో వరల్డ్ కప్స్ లో కూడా టీమిండియా సెమీస్ కు చేరుకుంది. ఈ రెండు సెమీస్ లో కూడా కోహ్లీ ఆడాడు. ఇక ఈ ప్రపంచ కప్ లో టీమిండియా మరోసారి సెమీస్ కు చేరింది. ఇందులో కూడా కోహ్లీ ఆడనున్నాడు. తద్వారా వరుసగా నాలుగు ప్రపంచ కప్ సెమీస్ మ్యాచుల్లో ఆడిన భారత క్రికెటర్ గా కోహ్లీ రేర్ ఫీట్ సాధించనున్నాడు.
కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని మూడు వరల్డ్ కప్స్ లో సెమీస్ ఫైనల్స్ ఆడారు. సచిన్ ఆడిన చివరి వరల్డ్ కప్ 2011 ధోని, కోహ్లీలకు ఫస్ట్ ప్రపంచ కప్. అయితే ఇప్పటికే ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పగా కోహ్లీ మాత్రం కొనసాగుతున్నాడు. ఇలా తాజా వరల్డ్ కప్ ఆడుతున్న కోహ్లి అత్యధిక సెమీ ఫైనల్స్ ఆడిన ఆటగాడిగా నిలవనున్నాడు.
Read More ICC World Cup 2023 : రోహిత్ డ్రీమ్ నెరవేరేనా... ఇప్పుడు కాకుంటే ఇక అంతేసంగతి...
మొత్తంగా భారత జట్టు ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ప్రపంచ కప్ సెమీస్ మ్యాచులు ఆడింది. ఇందులో ఇప్పటికే మూడిట్లో కోహ్లీ ఆడాడు... ఇవాళ నాలుగోసారి సెమీస్ ఆడనున్నారు. అయితే గత రెండు వరల్డ్ కప్స్ లో టీమిండియా సెమీస్ నుండే వెనుదిరిగింది. కానీ ఈసారి అలా జరక్కూడదని... న్యూజిలాండ్ ను ఓడించి భారత్ ఫైనల్స్ కు చేరాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.