ICC World Cup 2023 : రోహిత్ డ్రీమ్ నెరవేరేనా... ఇప్పుడు కాకుంటే ఇక అంతేసంగతి...
అద్భుతమైన ఫామ్ లో వున్న టీమిండియా ఈ ప్రపంచ కప్ గెెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కీలకమైన ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ కు ముందు రోహిత్ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ముంబై : స్వదేశంలో జరుగుతున్న ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు అదరగొట్టింది. ఈ మెగా టోర్నీలో ఆడిన ప్రతి మ్యాచ్ గెలుస్తూ ఓటమన్నదే ఎరుగని ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. ఇలా అత్యుత్తమ ప్రదర్శనతో అద్భుత విజయాలు అందుకున్న రోహిత్ సేన మరో వరల్డ్ కప్ ట్రోపీకి చేరువయ్యింది. ఈ క్రమంలో నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ జరగనుంది. ఇలాంటి కీలక మ్యాచ్ కు ముందు రోహిత్ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఈ ప్రపంచ కప్ విజయం కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా కీలకమని దినేశ్ లాడ్ అన్నారు. తన కెరీర్ లో ఒక్కసారైన వరల్డ్ కప్ ట్రోపీని ముద్దాడాలన్నది రోహిత్ కల... ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకునే అద్భుత అవకాశం అతడి ముందు వుందని అన్నారు. 2011 లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రోహిత్ ఆడలేడు... ఆ తర్వాత జరిగిన ప్రపంచ కప్ టోర్నీల్లో ఆడినా టీమిండియా గెలవలేకపోయింది. దీంతో తన ప్రపంచ కప్ కల నెరవేరుతుందో లేదోనని కంగారుపడుతున్న రోహిత్ కు ఈసారి మంచి అవకాశం వచ్చింది. దీన్ని చేజార్చుకుంటే ఇక అతడి కల కలగానే మిగిలిపోతుందని చిన్ననాటి కోచ్ అన్నారు.
ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 36ఏళ్లు... మరో వరల్డ్ కప్ నాటికి అతడి వయసు 40కి చేరుతుందని దినేశ్ లాడ్ తెలిపారు. ఈ వయసులో సాధారణంగా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలగుతారు... కాబట్టి రోహిత్ మరో ప్రపంచ కప్ ఆడతాడని తాను భావించడం లేదన్నారు. ఇదే తన చివరి వరల్డ్ కప్ అని రోహిత్ కు కూడా తెలుసు... కాబట్టి ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ ట్రోఫీ గెలవాలన్న పట్టుదల అతడి ఆటలో కనిపిస్తుందన్నారు. తన కెప్టెన్సీలో ప్రపంచ కప్ గెలిచి క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాలని రోహిత్ కోరుకుంటున్నాడని కోచ్ దినేశ్ లాడ్ తెలిపారు.
Read More ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో టీమిండియా ప్రదర్శన ఎలా వుందంటే..? 1975-2019 వరకు గణాంకాలు ఇవిగో..
సొంత మైదానం వాంఖడేలో నేడు సెమీఫైనల్ జరగనుంది... ఇందులో రోహిత్ అద్భుతంగా ఆడి అభిమానులను అలరిస్తారన్న నమ్మకం వుందన్నారు దినేశ్ లాడ్. ప్రస్తుతం టీమిండియా ఫామ్ ను చూస్తుంటే న్యూజిలాండ్ ను మరోసారి ఓడించడం అంత కష్టమేమీ కాదన్నారు. టీమిండియా ఫైనల్ కు చేరడమే కాదు మరోసారి ప్రపంచ విజేతగా నిలుస్తుందని రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ ధీమా వ్యక్తం చేసారు.