టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు.  ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఓపెనర్ గా అదరగొట్టిన రోహిత్ శర్మ...  బ్యాటింగ్ లోనే కాదు.. ఫీల్డింగ్ లోనూ అంతే అదరగొడుతున్నాడు. ఈ జోష్ ని బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లోనూ కొనసాగించాడు.  బంగ్లా క్రికెటర్ ని రోహిత్ శర్మ ఔట్ చేసిన తీరుకి కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా షాకయ్యాడు.

ఇంతకీ మ్యాటరేంటంటే.... బంగ్లాదేశ్‌తో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో మహ్మదుల్లా క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్న రోహిత్‌ శర్మ శభాష్‌ అనిపించాడు. అంతకుముందు రహీమ్‌ క్యాచ్‌ను సెకండ్‌ స్లిప్‌లో జారవిడచడంతో అసహనానికి గురైన రోహిత్‌.. ఇన్నింగ్స్‌ బ్రేక్‌లో స్లిప్‌ క్యాచ్‌లను ప్రాక్టీస్‌ చేసి మరీ దాన్ని అధిగమించాడు. ఫలితంగా మహ్మదుల్లా క్యాచ్‌ను ఎటువంటి తప్పిదం లేకుండా అందుకున్నాడు.

Alsoread పింక్ బాల్ టెస్ట్.... విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్...

 ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11 ఓవర్‌ తొలి బంతిని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ డిఫెన్స్‌ ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్‌ పట్టుకుని స్లిప్‌లోకి వెళ్లింది. ఆ క్రమంలోనే ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి ఆ క్యాచ్‌ను అందుకోవడానికి సిద్ధమయ్యాడు. కాగా, సెకండ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ అంతకుముందుగానే అలర్ట్‌ కావడంతో అమాంతంగా డైవ్‌ కొట్టాడు.

కోహ్లి బిత్తరపోయేలా ఒక్క ఉదుటన ఎగిరి క్యాచ్‌ను ఒడిసి పట్టుకున్నాడు. దాంతో బంగ్లా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ సున్నాకే ముగిసింది. కాకపోతే రోహిత్‌ ఈ క్యాచ్‌ పట్టిన తీరు టీమిండియా కెప్టెన్‌ కోహ్లితో పాటు జట్టులోని ఆటగాళ్లలో జోష్‌ నింపింది.