టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జాబితాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన తన జాబితాలో వేసుకున్న ఆయన తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్ లలో కెప్టెన్ గా ఐదు వేల పరుగులను వేగవంతంగా పూర్తి చేసిన ఘనత ఇప్పుడు కోహ్లీకి దక్కింది.

ప్రస్తుతం టీమిండియా కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్ జట్టు టెస్టు సిరీస్ కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే కోహ్లీ ఈ రికార్డ్ సాధించాడు. ఈ టెస్టు ముందు కెప్టెన్‌గా  4,968 పరుగులతో ఉన్న కోహ్లి.. తాజా మ్యాచ్‌లో 32 పరుగులు చేయడంతో ఆ రికార్డును సాధించాడు. ఓవరాల్‌గా ఇది కోహ్లికి 84వ టెస్టు కాగా, 7,100 పరుగులు పైగా చేశాడు. అయితే ప్రస్తుతం కోహ్లి 141వ టెస్టు ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. కెప్టెన్‌గా మాత్రం కోహ్లికిది 86వ ఇన్నింగ్స్‌.

అంతకుముందు ఈ రికార్డు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ పేరిట ఉండేది. ఒక కెప్టెన్‌గా ఐదు వేల టెస్టు పరుగులు చేయడానికి పాంటింగ్‌ 97 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు దాన్ని కోహ్లి బ్రేక్‌ చేశాడు. అయితే ఒక కెప్టెన్‌గా ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి టీమిండియా క్రికెటర్‌గా కూడా కోహ్లి ఘనత సాధించాడు. అదే సమయంలో కెప్టెన్‌గా ఐదువేల టెస్టు పరుగులు చేసిన ఆరో క్రికెటర్‌గా నిలిచాడు. 

ఈ జాబితాలో   రికీ పాంటింగ్‌( ఆస్ట్రేలియా-97 ఇన్నింగ్స్‌లు), క్లైవ్‌ లాయిడ్‌(వెస్టిండీస్‌-106 ఇన్నింగ్స్‌లు),గ్రేమ్‌ స్మిత్‌(దక్షిణాఫ్రికా-110 ఇన్నింగ్స్‌లు), అలెన్‌ బోర్డర్‌(ఆస్ట్రేలియా-116 ఇన్నింగ్స్‌లు), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌( న్యూజిలాండ్‌-130 ఇన్నింగ్స్‌లు)లు ఉన్నారు.  బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్‌ 37 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. చతేశ్వర్‌ పుజారా హాఫ్‌ సెంచరీ సాధించాడు. 93 బంతుల్లో 8 ఫోర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.అంతకుముందు బంగ్లాదేశ్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకు ఆలౌటైంది.