టెస్టు సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో త్వరలో జరగనున్న రెండో టెస్ట్‌కు సంబంధించి తొలి మూడు రోజులకు టికెట్లు హౌస్ ఫుల్ అయిపోయాయి. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని గ్రేట్ అంటూ కొనియాడాడు.

‘‘విరాట్ తిరిగి రావడంతో ఈడెన్ గార్డెన్ గ్యాలరీలు హౌస్‌ఫుల్ అవుతాయని.. దీనిని చూసి కోహ్లీ సంతోషిస్తాడని దాదా పేర్కొన్నాడు.  టెస్ట్ మ్యాచ్‌కు ప్రేక్షకుల్ని తీసుకురావడం అంత తేలిక కాదు. ఇది డే అండ్ నైట్ టెస్టు కావడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

భవిష్యత్తులో కూడా ఇదే రకమైన వాతావరణం కొనసాగాలని దాదా ఆకాంక్షించాడు. ఈడెన్ గార్డెన్‌లో ఏర్పాట్లు మైమరిపిస్తాయని.. తొలి మూడు రోజులు అభిమానులతో ఈడెన్ కిక్కిరిసిపోతుందన్నాడు. ఈ మ్యాచ్‌లోనూ భారత్ నెగ్గి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తన ప్రథమ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Also Read:బంగ్లాదేశ్ పై ఘన విజయం: రికార్డులే రికార్డులు

టీమిండియా అన్ని  విభాగాల్లోనూ పటిష్టంగా ఉందని.. మన విజయాన్ని బంగ్లాదేశ్ అడ్డుకోబోదనే ధీమా వ్యక్తం చేశారు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ పాయింట్ల పట్టికలో 300 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

ప్రస్తుత  రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ ను ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో భారత్ మట్టికరిపించి మరో అద్వితీయ విజయాన్ని సాధించింది. 

ఈ భారీ విజయంతో సారథిగా కోహ్లి అనేక రికార్డులను కొల్లగొట్టాడు. అత్యధిక ఇన్నింగ్స్‌ విజయాలను సాధించిన తొలి భారత సారథిగా  ధోని రికార్డును కోహ్లి బ్రేక్‌ చేశాడు. గతంలో ధోని కెప్టెన్సీలోని టీమిండియా 9 మ్యాచుల్లో ఇన్నింగ్స్‌ తేడాతో విజయాలను సాధించింది.  ప్రస్తుతం కోహ్లి కెప్టెన్సీ లో  ఇప్పటివరకు పది టెస్టుల్లో  ఇన్నింగ్స్‌ విజయాలను నమోదు చేసి రికార్డు సృష్టించింది. 

ఈ జాబితాలో అజారుద్దీన్‌(8), సౌరవ్‌ గంగూలీ(7) తరవాతి స్థానాల్లో ఉన్నారు. ఇక సారథిగా అత్యధిక విజయాలను సాధించడంలోనూ కోహ్లీ రికార్డు బుక్కుల్లోకెక్కాడు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌ అలెన్‌ బోర్డర్‌ సరసన కోహ్లి చేరాడు. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు 32 టెస్టు విజయాలను నమోదు చేసింది. 

Also Read:సెంచరీకి 3 పరుగుల దూరంలో..: ధోనీ వల్లనే అంటూ గంభీర్ ఫైర్

అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న 4వ కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్‌ స్మిత్‌ 53 విజయాలతో మొదటి స్థానంలో ఉండగా, ఆసీసీ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ 48 విజయాలతో రెండో స్థానంలో, మరో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌ వా 41 విజయాలతో మూడవ స్థానంలో ఉన్నారు.