న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్రమైన ఆరోపణ చేశాడు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన వన్డే ప్రపంచ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను ఉదహరిస్తూ ధోనీపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టాడు. ఆ మ్యాచులో తాను సెంచరీని మూడు పరుగుల తేడాతో కోల్పోవడానికి ధోనీయే కారణమని ఆయన ఆరోపించాడు. 2011 ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచిన విషయం తెలసిందే. ధోనీ సారథ్యంలో భారత్ ప్రపంచ కప్ ను అందుకుంది. 

ఆ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంక నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచులో వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ కాగా, సచిన్ టెండూల్కర్ 18 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత కోహ్లీ (35 పరుగులు) ఫరవా లేదనిపించాడు. అనంతరం గౌతమ్ గంభీర్, ధోనీ జంట మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేసింది. గంభీర్ 97 పరుగులు చేసి పెవిలియన్ చేరుకోగా, ధోనీ 91 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. దాంతో భారత్ విజయాన్ని అందుకుంది. 

తాను సెంచరీకి కేవలం 3 పరుగుల దూరంలో అవుట్ కావడానికి ధోనీ కారణమని గంభీర్ అంటున్నాడు. ఇన్నాళ్ల తర్వాత ఆయన తన ఆగ్రహాన్ని పంచుకున్నాడు. తాను మూడు పరుగులు చేస్తే సెంచరీ చేసేవాడినని, దానిపై తనకు తానే చాలా సార్లు ప్రశ్నించుకున్నానని, ఆ సమయంలో అసలు ఏమైందో చెబుతానని ఆయన అన్నాడు.

తాను సెంచరీ ఎందుకు చేయలేదనే విషయంపై చాలా మంది తనను అడిగారని, దానికి ఇప్పుడు సమాధానం చెబుతున్నానని గంభీర్ అన్నాడు. తాను సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉన్నప్పుడు ధోనీ తన వద్దకు వచ్చాడని, మూడు పరుగులు చేస్తే సెంచరీ పూర్తవుతుందనే విషయం చెప్పాడని, కానీ తాను సెంచరీ పూర్తి చేయడం కన్నా కప్ ను గెలుచుకోవడమే ముఖ్యమని అనుకున్నానని ఆయన వివరించాడు. 

ధోనీ చెప్పడంతో తాను సెంచరీపై ఆలోచన చేశానని, దాంతో తనలో అసహనం పెరిగిందని, ఆ క్రమంలోనే పెరీరా బౌలింగులో బౌల్డ్ అయ్యానని గంభీర్ చెప్పాడు. ఆ ప్రపంచ కప్ టోర్నీలో సెంచరీ చేయకపోవడం తనకు ఇప్పటికీ బాధిస్తూనే ఉందని అన్నాడు. సెంచరీ ఎందుకు చేయలేకపోయావని తనను ఇప్పటికీ చాలా మంది అడుగుతున్నారని, అందుకే ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చిందని గంభీర్ అన్నాడు.