Asianet News TeluguAsianet News Telugu

IND vs AUS T20: స్టేడియంలో క‌రెంట్ లేదు.. బిల్లు క‌ట్ట‌లేదు.. భార‌త్-ఆస్ట్రేలియా నాల్గో టీ20 జ‌రిగేనా?

India vs Australia, 4th T20I: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా నాల్గో టీ20కి ఆతిథ్యం ఇస్తున్న స్టేడియంలో కరెంటు లేదు.స్టేడియం ₹ 3.16 కోట్ల క‌రెంట్ బిల్లు బకాయి ఉంది. దీని కారణంగా స్టేడియంలో విద్యుత్ కనెక్షన్ 5 సంవత్సరాల క్రితం కట్ చేశార‌ని స‌మాచారం.
 

India vs Australia, 4th T20I: No Electricity At Raipur Stadium Hosting IND vs AUS T20 Today RMA
Author
First Published Dec 1, 2023, 1:54 PM IST

India vs Australia: రాయ్ పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో శుక్ర‌వారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. కీలకమైన మ్యాచ్ మ‌రికొన్ని గంట‌ల్లో షురూ కానుంది. అయితే, స్టేడియంలో క‌రెంట్ లేక‌పోవ‌డంతో మ్యాచ్ జ‌రుగుతుందా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. మ్యాచ్ కు ముందు స్టేడియంలో క‌రెంట్ లేద‌నే వార్త‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. స్టేడియంలోని కొన్ని ప్రాంతాల్లో క‌రెంట్ లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం విద్యుత్ బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డ‌మేన‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియానికి రూ.3.16 కోట్ల విద్యుత్ బిల్లు బకాయి ఉందనీ, దీంతో ఐదేళ్ల క్రితం స్టేడియంలో విద్యుత్ కనెక్షన్ కట్ అయిందని సంబంధిత వ‌ర్గాలు తెలిపినట్టు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు తాత్కాలిక కనెక్షన్ ఏర్పాటు చేయగా, అది ప్రేక్షకుల గ్యాలరీ, బాక్సులను మాత్రమే కవర్ చేస్తుంది. ఈ రోజు మ్యాచ్ సందర్భంగా ఫ్లడ్ లైట్లను జనరేటర్ ఉపయోగించి నడపాల్సి ఉంటుంది. స్టేడియం తాత్కాలిక కనెక్షన్ సామర్థ్యాన్ని పెంచడానికి కార్యదర్శి క్రికెట్ అసోసియేషన్ దరఖాస్తు చేసిందని రాయ్ పూర్ రూరల్ సర్కిల్ ఇన్చార్జి అశోక్ ఖండేల్వాల్ తెలిపారు.

ప్రస్తుతం విద్యుత్ తాత్కాలిక కనెక్షన్ సామర్థ్యం 200 కేవీగా ఉంది. దీనిని వెయ్యి కేవీకి అప్ గ్రేడ్ చేసేందుకు దరఖాస్తుకు ఆమోదం లభించినా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 2018లో హాఫ్ మారథాన్ లో పాల్గొన్న అథ్లెట్లు స్టేడియంలో విద్యుత్ సరఫరా గురించి ఫిర్యాదులు చేయ‌డంతో కలకలం రేగింది. 2009 నుంచి కరెంటు బిల్లు చెల్లించలేదనీ, రూ.3.16 కోట్లకు పెరిగిందని విద్యుత్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. స్టేడియం నిర్మాణం తర్వాత దీని నిర్వహణను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (పీడబ్ల్యూడీ)కి అప్పగించగా, మిగిలిన ఖర్చులను క్రీడా శాఖ భరించాల్సి ఉంది. కరెంటు బిల్లు చెల్లించకపోవడానికి ఇరు శాఖలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవ‌డంతో క్రీడాకారులు ఇబ్బందులు ప‌డుతున్నాడు. ప‌లుమార్లు కరెంట్ బిల్లుల గురించి నోటీసులు పంపినా చెల్లించ‌క‌పోవ‌డం, సంబంధిత చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం అధికారులు నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios