స్వదేశంలో ఆస్ట్రేలియాతో వరుసగా నాలుగు వన్డేల్లో ఓడిన కోహ్లిసేన, ఎట్టకేలకు రాజ్‌కోట్‌లో ఆ ఓటమి పరంపరలకు తెరదించుతూ.... గెలుపు బాట పట్టింది. గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది టీం ఇండియ.  నేడు సిరీస్ నిర్ణయాత్మక తుదిపోరులో చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో నేటి మధ్యాహ్నం 1.30కు తలపడనుంది. 

అన్ని రంగాల్లో అద్భుత బలగంతో కంగారూ శిబిరం సిరీస్‌ వైపు దూసుకొస్తుండగా.. సొంతగడ్డపై మరో సిరీస్‌ చేజార్చుకునే ప్రసక్తే లేదని మెన్‌ ఇన్‌ బ్లూ సమరానికి సిద్ధమవుతోంది. చిన్న బౌండరీలు కలిగిన చిన్నస్వామి స్టేడియంలో నేడు హోరాహోరీ పోరు ఖాయం.... 

ముంబయిలో ఆస్ట్రేలియా గెలవగా, రాజ్‌కోట్‌లో భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది.  సిరీస్‌ కైవసం చేసుకునేందుకు ఇరు జట్లు నేడు బెంగళూర్‌లో అంతిమ సమరానికి రెడీ అయ్యాయి. తొలి మ్యాచ్‌లో పరాజయం చవిచూసి, తరువాత మ్యాచుల్లో పుంజుకొని, సిరీస్‌ విజయాలు అందుకోవటం కోహ్లిసేనకు కొత్తేమీ కాదు. 

గతంలో స్వదేశంలో, విదేశాల్లోనూ... ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని విజయాలు సాధించింది. అలాగని ఆస్ట్రేలియాకు కూడా విజయాలను సాధించేందుకు చివరి వరకు పోరాడడం తెలుసు. అలా పోరాడి ఎన్నో సిరీస్ విజయాలను సాధించింది కూడా. ఈ నేపథ్యంలో బెంగళూర్‌ డిసైడర్ ఉత్కంఠను రేపుతోంది. 

Also read: ఆ వీడియోలు చూసి నేర్చుకున్నా, ఎంజాయ్ చేస్తూ ఆడతా.. కేఎల్ రాహుల్

రెండు అతిపెద్ద క్రికెటింగ్ జట్ల మధ్య, ఒకరకంగా చెప్పాలంటే క్రికెట్‌ పవర్‌ హౌస్‌ల నడుమ వన్డే సిరీస్‌ సవాల్‌ కావటంతో అభిమానులు చిన్నస్వామి మ్యాచ్‌వైపు ఆసక్తిగా చూస్తున్నారు. రంజుగా సాగుతున్న సిరీస్‌లో ఆఖరి పంచ్‌ కోహ్లిసేనదవుతుందేమో చూడాలి. 

రోహిత్‌ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిందే... 

భారత బ్యాటింగ్‌ లైనప్‌లో అరివీర విధ్వంసకారుడు రోహిత్‌ శర్మ ఇటు వాంఖడెలో, అటు రాజ్‌కోట్‌లోనూ నిరాశపరిచాడు. ఆసీస్‌ బౌలర్లను ఊచకోత కోసిన రికార్డు రోహిత్‌ సొంతం. టాప్‌-4 బ్యాట్స్‌మెన్‌లో శిఖర్‌ ధావన్‌, కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లిలు  సిరీస్‌లు సత్తా చాటారు. ఈ బృందంలో రోహిత్‌ శర్మ ఒక్కడి నుండే ఒక భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉంది. 

అమీతుమీ తేల్చుకోవాల్సిన సమరంలో రోహిత్‌ శర్మ నుంచి భారత్‌ ఒక బిగ్ ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. రోహిత్‌ చెలరేగితే... ప్రత్యర్థి జట్టు ఆశించడానికి ఇంక ఏమీ మిగలదనే సంగతి అందరికి బాగా తెలుసు. 

Also read: ధోనీకి మొండిచేయి: మాట్టాడేందుకు నిరాకరించిన సౌరవ్ గంగూలీ

ఒత్తిడిలో పునరాగమనం చేసిన శిఖర్‌ ధావన్‌ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి జోరుమీదున్నారు. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్ అయ్యర్‌, మనీశ్‌ పాండేలు ఒకింత విఫలమైనప్పటికీ, తమదైన ఇన్నింగ్స్‌ ఆడేందుకు సమయం కోసం కాచుకొని కూర్చున్నారు. 

ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తుది జట్టులో చోటుకు తగిన న్యాయం చేయాల్సి ఉంది. కేదార్‌ జాదవ్‌ మరోసారి బెంచ్‌కు మాత్రమే పరిమితం కాకతప్పదు.మొన్ననే పంత్ కు రీప్లేస్మెంట్ గా తెచ్చిన బ్యాక్ అప్ వికెట్ కీపర్ భరత్ కు ఆఖరు జట్టులో చోటు దక్కే ఛాన్స్ మాత్రం లేదు.  

'కంగారు' పడుతుందా...పెడుతుందా...? 

సిరీస్‌ డిసైడర్ లో ఆస్ట్రేలియా ఎటువంటి కంగారు లేకుండా బరిలోకి దిగుతోంది. ముంబయిలో ఊరించే లక్ష్యాన్ని ఓపెనర్లే ఊదేయగా.. రాజ్‌కోట్‌ ఛేదనలోనూ ఆసీస్‌ రేసులోనే నిలిచింది. లబుషేన్‌ రాజ్‌కోట్‌లో ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ ఆడాడు. అరంగ్రేట ఇన్నింగ్స్‌లోనే 47 బంతుల్లో 46 పరుగులు చేశాడు. స్టీవ్‌ స్మిత్‌ మొన్న అదరగొట్టే ఇన్నింగ్స్‌ తో మంచి ఫామ్‌లో ఉన్నాడు. 

గత పర్యటనలో మెరిసిన క్యారి, టర్నర్‌, ఆగర్‌లు అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ చెలరేగే అవకాశం ఉంది. బౌలింగ్‌ విభాగం అత్యంత బలంగా ఉంది. మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌ల తో కూడిన పేస్ త్రయం కోహ్లిసేనకు గట్టి సవాల్‌ విసురుతున్నారు. 

స్పిన్నర్‌ ఆడం జంపా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి కొరకరాని కొయ్యగా మారేందుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆఖరి పోరాటంలోనూ జంపా వర్సెస్‌ కోహ్లి సమరం ఆసక్తి రేపుతోంది. 

2019లో భారత్ పై టీ20, వన్డే సిరీస్‌లు గెల్చుకున్న ఆస్ట్రేలియా.. 2020లో వన్డే సిరీస్‌ను సైతం ఎగరేసుకుపోవాలని కంకణం కట్టుకున్నట్టు కనబడుతోంది. ఏది ఏమైనా ఈ రోజు సమరంలో ఇరు జట్లు కూడా పూర్తి స్థాయి ఆటతీరుతో ఉత్కంఠ రేపడం ఖాయంగా కనబడుతుంది. 

అందరి కళ్ళు బుమ్రా పైనే...  

రాజ్‌కోట్‌ వన్డేలో భారత్‌ గెలిచినా, స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శన భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. 9.1 ఓవర్లలో బుమ్రా కేవలం ఒక్క వికెటే మాత్రమే తీయగలిగాడు. కొత్త బంతితో ఫించ్‌, వార్నర్‌లను కట్టడి చేయగలిగిన బుమ్రా, డెత్‌ ఓవర్లలో కూడా బాగానే కట్టడి చేసాడు. 

Also read: ఆస్ట్రేలియా ఓటమి... మరోసారి నిజమైన మిచెల్ స్టార్క్ సెంటిమెంట్

శ్రీలంకతో సిరీస్‌లో ప్రభావం చూపని బుమ్రా వాంఖడెలో తేలిపోయాడు. రాజ్‌కోట్‌లో ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు చిన్నస్వామి మ్యాచ్‌లో బుమ్రా ప్రదర్శనపై ఫోకస్‌ కనిపిస్తోంది. 

నవదీప్‌ సైని, మహ్మద్‌ షమిలు మరోమారు బుమ్రాతో కలిసి పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. బ్యాటింగ్‌ మెరుపులు షార్దుల్‌ ఠాకూర్‌కు తుది జట్టులో చోటు కల్పించలేకపోయాయి. 

ఓపెనర్లు రెడీ 

రాజ్‌కోట్‌ వన్డేలో భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లు గాయపడ్డారు. శిఖర్‌ ధావన్‌ పక్కటెముకల నొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది. నిర్ణయాత్మక వన్డేకు ధావన్‌ సిద్ధమని జట్టు మేనేజ్‌మెంట్‌ వర్గాల సమాచారం. 

ఇక హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ భుజం గాయంపై స్పష్టత రావాల్సి ఉంది. అతడు కోలుకున్నట్టే అని చెబుతున్నప్పటికీ, న్యూజిలాండ్‌ పర్యటన దృష్ట్యా రోహిత్‌తో ప్రయోగానికి భారత్‌ పునరాలోచిస్తుంది. 

తల అదరటంతో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి చేరుకున్న రిషబ్‌ పంత్‌ ఫిట్‌నెస్‌ పొందినట్టే ఉన్నాడు. కానీ అతడిని మనీష్ పాండే బదులు తీసుకుంటారా లేదా రాహుల్ మరోసారి వికెట్ కీపింగ్ చేస్తాడా చూడాల్సి ఉంది.  మణికట్టు మాయగాడు చాహల్‌ను కాదని చైమామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ మరోసారి తుది జట్టులోకి రానున్నాడు. 

పిచ్‌, వెదర్ కండిషన్స్... 

భారత్‌, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో నేడు చిన్నస్వామిలో మరో పరుగుల పండుగ ఖాయం. బెంగళూర్‌ చిన్నస్వామి స్టేడియంలో రెండో ఇన్నింగ్స్‌కు మంచు ప్రభావం ఖచ్చితంగా కనిపించనుంది.  

చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్ అవడం వల్ల భారీ హిట్టర్లకు అనువైన స్టేడియం. సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌కు వాతావరణం సైతం సహకరించే వీలుంది. స్పిన్నర్లు మిడిల్‌ ఓవర్లలో కీలక పాత్ర పోషించనున్నారు. 

ప్లేయింగ్ ఎలెవన్  (అంచనా)

భారత్‌ : శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, శ్రేయాష్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌, మనీశ్‌ పాండే, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, నవదీప్‌ సైని, మహ్మద్‌ షమి, జశ్‌ప్రీత్‌ బుమ్రా. 

ఆస్ట్రేలియా : అరోన్‌ ఫించ్‌, డెవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, అలెక్స్‌ క్యారె, అష్టన్‌ టర్నర్‌, ఆష్టన్‌ ఆగర్‌, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడం జంపా.