ENG vs IND: లార్డ్స్ వన్డేలో భారత్ తడబడుతోంది. మోస్తారు లక్ష్య ఛేదనలో భారత జట్టు  30 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. 

లార్డ్స్ వన్డేలో భారత జట్టు తడబడుతున్నది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 247 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ లు విఫలమయ్యారు. చూస్తుంటే తొలి వన్డేలో ఇంగ్లాండ్ పరిస్థితే ఇండియాకు తలెత్తేట్టు ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. 

247 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ కు ఆది నుంచే ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఇంగ్లాండ్ పేసర్లు రీస్ టాప్లే, డేవిడ్ విల్లే నిప్పులు చెరిగే బంతులతో టీమిండియాను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తొలి రెండు ఓవర్లలో పరుగులే రాలేదు. మూడో ఓవర్లో లెగ్ బై ద్వారా 4 పరుగులొచ్చాయి. కానీ అదే ఓవర్లో రోహిత్ శర్మ (0) టాప్లే బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 5 ఓవర్లకు భారత్ స్కోరు 10 పరుగులే. 

క్రీజులో తంటాలు పడుతున్న ధావన్ (9)కూడా టాప్లే బౌలింగ్ లో వికెట్ కీపర్ జోస్ బట్లర్ క్యాచ్ పట్టడం ద్వారా పెవిలియన్ చేరాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రిషభ్ పంత్ (0)కూడా బ్రైడన్ కార్స్ వేసిన 11 ఓవర్లో రెండో బంతికి ఫిలిప్ సాల్ట్ ఇచ్చి వెనుదిరిగాడు.

Scroll to load tweet…

భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ (16.. 3 ఫోర్లు) కూడా వారి ఆశల మీద నీళ్లుచల్లాడు. మూడు బౌండరీలతో కుదురుకున్నట్టే కనిపించిన కోహ్లీని విల్లే బోల్తా కొట్టించాడు. 12 ఓవర్లో రెండో బంతికి కోహ్లి పెవిలియన్ చేరాడు. 31పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్.. లార్డ్స్ వన్డేలో పోరాడుతున్నది. 

ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ (12నాటౌట్), హార్ధిక్ పాండ్యా (7 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసురుతూ పరుగులకు అడ్డుకట్ట వేయడమే గాక వికెట్లు కూడా తీస్తూ టీమిండియా పై ఒత్తిడి పెంచుతున్నారు. 15 ఓవర్లు ముగిసేసమయానికి భారత్ .. 54 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి ఆడుతున్నది. భారత విజయానికి ఇంకా 35 ఓవర్లలో 193 పరుగులు కావాలి.