సారాంశం

Team India Squad Ireland T20 Series: ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. జట్టు కెప్టెన్సీ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేతిలో పెట్టారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో యువ ఆటగాళ్లకే చోటు కల్పించారు.

Team India Squad Ireland T20 Series: ఐర్లాండ్‌తో  జరుగనున్న టీ20 సిరీస్ కు బీసీసీఐ సోమవారం నాడు భారత జట్టును ప్రకటించింది. జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించారు. ఐర్లాండ్ పర్యటన కోసం ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో యువ ఆటగాళ్లకే చోటు కల్పించారు. ఐదు రోజుల్లో ఐర్లాండ్‌తో టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనున్నది. ఈ మ్యాచ్‌లు డబ్లిన్‌ వేదికగా జరగనున్నాయి.

భారత జట్టు వివరాలిలా.. 

జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రితురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ రవి బిష్ణోయ్, ఫేమస్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ లకు చోటు దక్కింది. 

కాగా.. హార్దిక్ పాండ్యా, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లకు ఈ పర్యటనలో చోటు దక్కలేదు. ఆగస్టు-సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ల దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇచ్చినట్టు తెలుస్తోంది. జట్టు వైస్ కెప్టెన్సీని రితురాజ్ గైక్వాడ్ చేతిలో పెట్టారు.  

బుమ్రా రీఎంట్రీ

చాలా కాలం తర్వాత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా గత ఏడాది సెప్టెంబర్ 25న ఆస్ట్రేలియాతో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత.. అతను జట్టుకు దూరమయ్యారు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో బుమ్రా పునరాగమనం టీమ్ ఇండియాకు శుభవార్త. బుమ్రాతో పాటు, ప్రముఖ ఫాస్ట్ బౌలర్ కృష్ణ కూడా జట్టులోకి వచ్చాడు.

ప్రధాన కోచ్ ద్రవిడ్‌కు కూడా విశ్రాంతి!

మీడియా నివేదికల ప్రకారం.. టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, అతని సహచర సహాయక సిబ్బంది విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్), పరాస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్) కూడా ఐర్లాండ్ పర్యటనలో విశ్రాంతి తీసుకోనున్నారు. అటువంటి పరిస్థితిలో ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ) చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు.