టీమిండియా మహిళల జట్టు క్రీడాకారిణి పూనమ్ యాదవ్ ఐసీసీ టీ20 ప్రపంచ జట్టులో స్థానం సంపాదించిన ఏకైక భారత మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఈ ఏడాది మహిళా ప్రపంచకప్ ఊహించిన దానికంటే గ్రాండ్ సక్సెస్ కావడంతో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి హర్షం వ్యక్తం చేసింది.

అందుకే మెగా టోర్నీ ముగిసిన వెంటనే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేసింది. ఇందులో ఐదుగురు ఆస్ట్రేలియా, నలుగురు ఇంగ్లాండ్, ఒకరు దక్షిణాఫ్రికా నుంచి ఎంపికయ్యారు.

Also Read:ఫైనల్లో ఓటమి: ఏడ్చేసిన షెఫాలీ వర్మ, ఓదార్చిన హర్మాన్ ప్రీత్ కౌర్

టోర్నీ ఆసాంతం పరుగుల వరద పారించిన అలీసా హీలి, బెత్‌మూనీని ఓపెనర్లుగా ఎంపిక చేయగా.. వీరిద్దరూ ఫైనల్లో భారత్‌ బౌలర్లను చీల్చి చెండాడారు. మూడు, నాలుగు స్థానాల్లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు నటాలీ సీవర్, హెథర్ నైట్‌కు ఐసీసీ చోటు కల్పించింది.

వరల్డ్ ఎలెవన్‌కు కెప్టెన్‌గా మెగ్ లానింగ్‌ను ఎంపిక చేశారు. బౌలింగ్ విభాగానికి వచ్చే సరికి ఆసీస్ నుంచి జొనాసెన్, ఇంగ్లీష్ క్రీడాకారిణి సోఫీ ఎకిల్ స్టోన్, టీమిండియా స్పిన్నర్ పూనమ్ యాదవ్‌కు చోటు కల్పించింది.

మేఘన్ షూట్, అన్యా ష్రబ్ సోల్‌లకు పేసర్లకుగా ఛాన్సిచ్చింది. ఇక లీగ్ దశలో భారత్‌కు మంచి ఆరంభాలు అందించి జట్టు ఫైనల్‌కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మన్‌ను 12వ క్రికెటర్‌గా రిజర్వ్‌ కేటగిరీలో తీసుకున్నారు.

Also Read:మహిళల టీ20 ప్రపంచకప్: ఫైనల్‌లో భారత్ చిత్తు చిత్తు, ఐదోసారి విశ్వవిజేతగా ఆసీస్

అంతకు ముందు పూనమ్ యాదవ్‌పై టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రశంసలు కురిపించింది. ఈ టోర్నీలో భారత్ బ్యాటింగ్‌లో తక్కువ పరుగులే చేసినా బౌలర్ల ఆధిపత్యంతో విజయాలు సాధించిందన్నారు. పూనమ్ తొలి మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు అద్భుతంగా రాణించిందని హర్మన్ ప్రీత్ చెప్పింది.