మెల్బోర్న్: ఆస్ట్రేలియాపై జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పైనల్లో ఓటమి పాలు కావడంతో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ ఉద్వేగాన్ని నిలువరించుకోలేక ఏడ్చేసింది. లీగ్ దశలో పరుగుల వరద పారించిన షెఫాలీ వర్మ ఫైనల్ మ్యాచులో విఫలమైంది. కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది. 

అంతేకాకుండా ఆస్ట్రేలియా ఓపెనర్ అలీస్సా హేలీ క్యాచ్ ను కూడా జార విడిచింది. హేలీ ఆ తర్వాత భారత బౌలర్లను చితక్కొట్టింది. 39 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్స్ లతో 75 పరుగులు చేసింది. భారత్ ముందు ఆస్ట్రేలియా 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 16 ఏళ్ల షెఫాలీ వర్మ స్కట్ బౌలింగులో ఔటైన తర్వాత ముఖాన్ని చేతుల్లో దాచుకుని కూర్చుండిపోయింది. 

 

భారత కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్, హర్లీన్ డీయోల్ ఆమెను ఓదార్చారు. షెఫాలీ వర్మ ఐదు మ్యాచుల్లో 165 పరుగులు చేసింది. టోర్నమెంట్ యావత్తూ అద్భుతంగా ఆడి, ఫైనల్లో చతికలపడింది. ఆస్ట్రేలియా బౌలర్ల ముందు భారత బ్యాట్స్ వుమెన్ నిలబడలేక 99 పరుగులకే చేతులెత్తేశారు