India vs West Indies T20I: మహేంద్ర సింగ్ ధోని తర్వాత గ్రౌండ్ లో కూల్ గా వ్యవహరిస్తాడని పేరు గడించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. గురువారం నాటి మ్యాచులో ఆగ్రహంతో ఊగిపోయాడు. బంతిని కాళ్లతో తంతూ...
గ్రౌండ్ లో కూల్ గా ఉండే రోహిత్ శర్మ.. గురువారం నాటి మ్యాచులో మాత్రం సహనం కోల్పోయాడు. ఈజీ క్యాచ్ మిస్ చేసిన టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎప్పుడో తప్ప హిట్ మ్యాన్ కు కోపం రావడం.. సహనం కోల్పోవడం చాలా అరుదు. కూల్ అండ్ కామ్ గా పనికానివ్వడంలో ధోనిని ఫాలో అయ్యే రోహిత్ శర్మ.. గురువారం విండీస్ తో మ్యాచులో పావెల్ ఇచ్చిన సులభమైన క్యాచును జారవిడవడంతో కోపంతో ఊగిపోయాడు.
విండీస్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే పావెల్ (68 నాటౌట్), నికోలస్ పూరన్ (62) లు వీరవిహారం చేస్తూ.. విండీస్ ను విజయతీరాలకు చేర్చేందుకు కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో 16వ ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన భువనేశ్వర్.. నాలుగో బంతిని విసిరాడు. అప్పటికే 38 పరుగులతో ఉన్న పావెల్.. భువీ విసిరిన స్లో బంతిని గాల్లోకి లేపాడు.
బౌలర్ దగ్గరే గాల్లోకి లేచిన బంతిని అందుకోవడానికి అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ తో పాటు రిషభ్ పంత్ కూడా దగ్గరగా వచ్చారు. కానీ భువీ మాత్రం.. ‘అది నా క్యాచ్’ అన్నట్టుగా సైగ చేయడంతో వాళ్లిద్దరూ డ్రాప్ అయ్యారు. అయితే ఎత్తు నుంచి వచ్చిన బంతిని అందుకోవడంలో భువీ అంచనా తప్పింది. క్యాచ్ పట్టే క్రమంలో అతడు బంతిని జారవిడిచాడు.
దీంతో రోహిత్ శర్మ అసహనానికి లోనయ్యాడు. ‘ఏంటి భువీ ఇది..’ అన్నట్టుగా అతడి వంక చూస్తూ.. అక్కడే ఉన్న బంతిని కాలితో బలంగా తన్నాడు. అప్పటికే పూరన్, పావెల్ లు పరుగు పూర్తి చేయడంతో రోహిత్ శర్మకు కోపం ఎక్కువైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.
కాగా.. గురువారం నాటి మ్యాచులో 187 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ జట్టు విజయానికి దగ్గరగా వచ్చి గెలిచినంత పని చేసింది. చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు అవసరం ఉండగా.. 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్.. నాలుగు పరుగులే ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో హర్షల్ పటేల్.. 16 పరుగులు ఇచ్చాడు. దీంతో భారత్.. 8 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 2-0తో సిరీస్ గెలుచుకుంది. మొత్తంగా టీ20లలో భారత్ కు ఇది వందో విజయం.
