Asianet News TeluguAsianet News Telugu

నేడే విశాఖ వన్డే...రికార్డు ఓటమి ప్రమాదంలో భారత్

20 ఓవర్ల ఆటలో కాస్త పోటీ ఎదురైనా, 50 ఓవర్ల పోరులో కోహ్లిసేనకు తిరుగుండదు... చెన్నై వన్డేకు ముందు అందరి నోటా ఇదే మాట. ఒక్క మ్యాచ్‌ ఫలితం సిరీస్‌ అంచనాలను మార్చివేసింది. యువ ఆటగాళ్ల ప్రతిభ అండతో కరీబియన్‌ జట్టు వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలువగా... విశాఖ వన్డేకు ముందు కోహ్లిసేన సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడింది

IND vs WI: India under the threat of a worst record defeat
Author
Vishakhapatnam, First Published Dec 18, 2019, 9:28 AM IST

విశాఖపట్నం: ఫార్మాట్‌ ఏదైనా ఇంటా బయటా ఇరగదీస్తున్న టీమ్‌ ఇండియాకు ఉన్నట్టుండి రికార్డు ఓటమి భయం పట్టుకుంది. గత 15 ఏండ్లలో భారత్‌ సొంతగడ్డపై వరుసగా రెండు వన్డే సిరీస్‌లు కోల్పోలేదు. స్వదేశీ పిచ్‌లపై వరుసగా ఐదు వన్డేల్లో పరాజయం చవిచూడలేదు. 

విశాఖ వన్డేలో ఓడితే.. 15 ఏండ్ల తర్వాత భారత్‌ వరుసగా రెండు వన్డే సిరీస్‌లు, వరుసగా ఐదు వన్డేల్లో ఓడిన చెత్త రికార్డుకు చేరువయ్యే ప్రమాదంలో పడింది. చెపాక్‌ విజయంతో వెస్టిండీస్‌ సిరీస్‌పై గురి పెట్టగా.. అచ్చొచ్చిన విశాఖలో సిరీస్‌ సమం చేయాలని కోహ్లిసేన భావిస్తోంది. 

విశాఖలో భారత్‌, వెస్టిండీస్‌ రెండో వన్డే పోరు కు సర్వం సిద్ధం... 

20 ఓవర్ల ఆటలో కాస్త పోటీ ఎదురైనా.. 50 ఓవర్ల పోరులో కోహ్లిసేనకు తిరుగుండదు!. చెన్నై వన్డేకు ముందు అందరి నోటా ఇదే మాట. ఒక్క మ్యాచ్‌ ఫలితం సిరీస్‌ అంచనాలను మార్చివేసింది. 

యువ ఆటగాళ్ల ప్రతిభ అండతో కరీబియన్‌ జట్టు వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలువగా... విశాఖ వన్డేకు ముందు కోహ్లిసేన సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడింది. ఒక్క ఓటమితో జట్టు భవితవ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు కానీ, 15 ఏండ్ల తర్వాత భారత్‌ వరుసగా దారుణ పరాభవ రికార్డులకు చేరువైతుందనే ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. లెక్క సరి చేయాలని టీమ్‌ ఇండియా విశాఖలో అడుగుపెడితే.. సిరీస్‌ గెలవాలని విండీస్‌ విశాఖకు వచ్చింది. 

విరాట్‌ చెలరేగుతాడా? : 

రోహిత్‌ శర్మ అమ్మమ్మ ఊరులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గణాంకాలు అమోఘం. 5 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 556 పరుగులు చేశాడు. మూడు సెంచరీలు సహా 99, 65 పరుగుల ఇన్నింగ్స్‌లతో చెలరేగాడు. విశాఖలో కండ్లుచెదిరే రికార్డులున్న కోహ్లి మరోసారి ఇక్కడ చెలరేగుతాడని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

చెన్నైలో స్వల్ప స్కోరుకే నిరాశపరిచిన విరాట్‌ విశాఖలో బదులు తీర్చుకుంటే కరీబియన్‌ బౌలర్లకు పగలే చుక్కలు కనిపించటం ఖాయం. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ ఒక్కడే కొద్దిగా తడబాటులో ఉన్నాడు. 

Also read: IND vs WI : రేపే వైజాగ్ వన్డే... గెలిచేదెవరంటే!

కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ టచ్‌లోకి వచ్చారు. అమ్మమ్మ ఊరులో రోహిత్‌ శర్మ సైతం స్పెషల్‌ ఇన్నింగ్స్‌ ఆడతాడేమో చూడాలి. దక్షిణాఫ్రికాతో టెస్టులో ఓపెనర్‌గా అరంగ్రేటం చేసిన రెండు సెంచరీలు బాది ఊపుమీదున్న రోహిత్‌.. విశాఖలో హ్యాట్రిక్‌ సెంచరీ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

జస్ప్రీత్ బుమ్రా లేని లోటు బౌలింగ్‌ విభాగంలో స్పష్టంగా తెలుస్తుంది. ఆరంభ ఓవర్లలో భువనేశ్వర్‌, బుమ్రాలు టాప్‌ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు ఆరంభ ఓవర్లలో వికెట్లు కష్టంగా మారింది. 

స్పిన్‌కు సహకరించే చెపాక్‌ పిచ్‌పై కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాలు విండీస్‌ను కట్టడి చేయలేకపోయారు. నేడు జడేజా స్థానంలో చాహల్‌ జట్టులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. మహ్మద్‌ షమి, దీపక్‌ చాహర్‌లు మరింత బాధ్యత తీసుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. 

బౌలింగ్‌ విభాగం వైఫల్యంతో చెపాక్‌లో ఓడిన భారత్‌.. విశాఖలో ఆ పొరపాటు సరిదిద్దుకోవాలని చూస్తోంది. బ్యాట్స్‌మన్‌గా తొమ్మిది పరుగులే చేసిన శివం దూబె, బౌలర్‌గా ఓవర్‌కు తొమ్మిది పరుగుల చొప్పున సమర్పించుకున్నాడు. శివం దూబె బ్యాటింగ్‌పై నమ్మకం ఉన్నా, బౌలర్‌గా అతడి సత్తాపై అనుమానాలు ఎక్కువవుతున్నాయి.

జోరుమీదున్న కరీబియన్లు : 

గత ఏడాది ఇక్కడ జరిగిన వన్డేను షిమ్రోన్‌ హెట్‌మయర్‌ 123 శతక విన్యాసంతో వెస్టిండీస్‌ మ్యాచ్‌ను టై చేసుకుంది. ఇప్పుడు చెన్నైలో సెంచరీ బాదిన హెట్‌మయర్‌ ఫేవరెట్‌ గ్రౌండ్‌ విశాఖకు వస్తున్నాడు. అతడికి తోడుగా ఓపెనర్‌ హోప్ ఉండనే ఉన్నాడు. 

పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన ఓపెనర్‌ ఎవిన్‌ లెవిస్‌ సైతం తోడైతే విండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా తయారు కానుంది. మిడిల్‌ ఆర్డర్‌లో నికోలస్‌ పూరన్‌, కీరన్‌ పొలార్డ్‌, రోస్టన్‌ చేజ్‌ వంటి భారీ హిట్టర్లు విండీస్‌కు ఛేదనలో ఉపయుక్తం కానున్నారు. 

Also read: కోహ్లీ, రోహిత్ శర్మలను అధిగమించాలనే..: హోప్ ఆశ

బౌలింగ్‌ విభాగం పరంగా వెస్టిండీస్‌ తొలి వన్డేలో మెప్పించింది. షెల్డన్‌ కాట్రెల్‌, అల్జారీ జొసెఫ్‌, కీమో పాల్‌, జేసన్‌ హోల్డర్‌లకు తోడు హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌ చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ చేస్తున్నాడు. 

విండీస్‌ బౌలర్లు మెరుగ్గా రాణిస్తే మరోసారి భారత్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేయవచ్చుని విండీస్ భావిస్తోంది. కీరన్‌ పొలార్డ్‌ సారథ్యంలో వెస్టిండీస్‌ సూపర్‌ విక్టరీపై కన్నేసింది. విశాఖలో నెగ్గి వన్డే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకోవాలని వెస్టిండీస్‌ తహతహలాడుతోంది. 

పిచ్‌...పరిస్థితులు  

విశాఖలో ఎటువంటి పిచ్‌ సిద్ధం చేసినా ఇక్కడ స్వల్ప స్కోర్లు మాత్రమే నమోదయ్యాయి. టీ20, వన్డేల్లో ఇక్కడ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. నేటి మ్యాచ్‌లోనూ స్పిన్‌ ప్రభావం కనిపించనుంది. 

2010 నుంచి విశాఖలో సగటు తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 275. మంచు ప్రభావం దృష్ట్యా లక్ష్య ఛేదన సులభతరం అవనుండడంతో... టాస్‌ నెగ్గిన జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు ఇష్టపడనుంది. మ్యాచ్‌ రోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుందని వాతావరణశాఖ ఇప్పటికే తెలియజేసింది 

జట్టు కూర్పు (అంచనా) :

భారత్‌ : రోహిత్‌ శర్మ, కెఎల్‌ రాహుల్‌, శ్రేయాష్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, రిషబ్‌ పంత్‌, శివం దూబె, జడేజా/ చాహల్‌, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి.

వెస్టిండీస్‌ : షైరు హౌప్‌, ఎవిన్‌ లెవిస్‌, షిమ్రోన్‌ హెట్‌మయర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ ఛేజ్‌, కీరన్‌ పొలార్డ్‌, జేసన్‌ హౌల్డర్‌, కీమో పాల్‌, హెడెన్‌ వాల్ష్‌, అల్జారీ జొసెఫ్‌, షెల్డన్‌ కాట్రెల్‌.

Follow Us:
Download App:
  • android
  • ios