విశాఖపట్నం: పరుగుల విషయంలో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అధిగమించడమే తన లక్ష్యమని వెస్టిండీస్ బ్యాట్స్ మన్ షాయ్ హోప్ అన్నాడు. అయితే, భారత్ పై సిరీస్ విజయం సాధించడానికే తాను మొదటి ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పాడు. 

బుధవారం ఇండియాతో విశాఖపట్నంలో రెండో వన్డే మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడాడు. ఈ ఏడాది, అంటే 2019లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో హోప్ మూడో స్థానంలో నిలిచాడు. 

అతను 1225 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 1292 పరుగులతో తొలి స్థానంలోనూ 1268 పరుగులతో రోహిత్ శర్మ రెండో స్థానంలోనూ ఉన్నారు. 

Also Read: IND vs WI : రేపే వైజాగ్ వన్డే... గెలిచేదెవరంటే

బ్యాట్స్ మన్ గా జట్టు కోసం సాధ్యమైనంత సాధించాలని కోరుకుంటానని, అది జట్టు విజయానికి తోడ్పడితే మరింత సంతృప్తిగా ఉంటుందని ఆయన అన్నాడు. రోహిత్, కోహ్లీలను అగ్రస్థానాల నుంచి దించాలనుకుంటే తాము ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నాడు.

గురువారంనుంచి కోల్ కత్తాలో ఐపిఎల్ కోసం వేలం పాటలు జరుగుతున్న నేపథ్యంలో దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మ్యాచ్ ఆడుతారా అని అడిగితే అది కూడా ఉంటుందని, కానీ అది ద్వితీయమేనని, తాము ఇక్కడికి ఇండియాతో సిరీస్ ఆడడానికి వచ్చామని, మిగతాది ఏదైనా ద్వితీయమేనని అన్నాడు.