Virat Kohli 100th Test: రన్ మిషీన్ విరాట్ కోహ్లి ఫ్యాన్స్ అంటే మాములుగా ఉండదు మరి.. వరుసగా కోహ్లిని అవమానించే చర్యలకు దిగుతున్న  బీసీసీఐకి  అతడి ఫ్యాన్స్ దిమ్మతిరిగే షాకిచ్చారు.. 

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి అభిమానులు చివరికి అనుకున్నది సాధించారు. తమ అభిమాన క్రికెటర్ అరుదైన మైలురాయిని చేరుకుంటున్న వేళ.. ఆ ప్రత్యేక క్షణాలను తాము కండ్ల నిండారా వీక్షించాలని అనుకుంటున్నామని, తమకు అడ్డుకోవద్దని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మీద తీసుకొచ్చిన ఒత్తిడి ఫలించింది. సోషల్ మీడియా వేదికగా విరాట్ ఫ్యాన్స్ నడిపిన క్యాంపెయిన్.. విజయవంతమైంది. మొహాలీ వేదికగా జరుగబోయే తొలి టెస్టును 50 శాతం ప్రేక్షకుల మధ్య నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరించింది. 

ముందుగా ఈ టెస్టును ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ భావించింది. ఈ మేరకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) కూడా ఏర్పాట్లను పూర్తి చేసింది. కానీ అనూహ్యంగా విరాట్ ఫ్యాన్స్ ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Scroll to load tweet…

విరాట్ కోహ్లిపై బీసీసీఐ కక్షపూరిత వైఖరి అవలంభిస్తున్నదని బీసీసీఐపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతనెలలో ముగిసిన వెస్టిండీస్, లంకతో టీ20లకు ప్రేక్షకులను అనుమతించి.. లంకతో రెండో టెస్టు జరిగే బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం) లో కూడా ఈ అవకాశం కల్పించి మొహాలీ టెస్టు (కోహ్లి వందో టెస్టు) లో మాత్రం ఖాళీ స్టేడియంలో నిర్వహించడమేంటని మండిపడ్డారు. ఇదే విషయమై కోహ్లి అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పై వరుస ట్వీట్లతో హోరెత్తించారు. మొహాలీ టెస్టుకు ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐకి బహిరంగ లేఖ రాశారు. #Allowcrowdinmohali హ్యాష్ ట్యాగ్ తో బీసీసీఐకి చుక్కలు చూపించారు. 

కోహ్లి అభిమానులతో పాటు టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా బీసీసీఐ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రికెటర్ల కెరీర్ లో వందో టెస్టు అనేది అపురూపమైన మైలురాయి అని.. ఏ నటుడైనా, క్రికెటరైనా అభిమానుల ముందే తమ టాలెంట్ ను ప్రదర్శించాలని కోరుకుంటారని, కానీ బీసీసీఐ ఇలా చేయడం బావ్యం కాదని వ్యాఖ్యానించాడు. ఇది కోహ్లికి నిరాశ కలిగించేదని ఆందోళన వ్యక్తం చేశాడు. 

Scroll to load tweet…

సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో బీసీసీఐ దిగొచ్చింది..! మొహాలీ టెస్టులో 50 శాతం ప్రేక్షకులను అనుమతించింది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. తొలి టెస్టు మార్చి 4న ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మేరకు బీసీసీఐ ఆ తంతును త్వరగా పూర్తి చేస్తే రేపట్నుంచి టికెట్ల అమ్మకం, ఇతర ఏర్పాట్లపై పీసీఏ దృష్టి సారించాల్సి ఉంది. బుధవారం టికెట్లను విక్రయించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.