Shardul Thakur Irritated By Temba Bavuma: దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల సారథి, టెస్టులలో వైస్ కెప్టెన్ గా ఉన్న టెంబ బవుమాపై టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అతడిని అనకూడని మాట అన్నాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు గురువారం ముగిసిన రెండో టెస్టులో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ టెస్టులో ఓడిపోతున్నామనే ఫ్రస్టేషనో లేక మరే కారణమో గానీ టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్.. సౌతాఫ్రికా ఆటగాడు టెంబ బవుమా పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అతడిని ఉద్దేశిస్తూ అసభ్యకర పదం వాడాడు. ఆ పదం వాడినందుకు గాను దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి అంపైర్ అల్లావుద్దీన్ పాలేకర్.. ఠాకూర్ ను హెచ్చరించాడు. భాష ముఖ్యమని ఠాకూర్ కు సూచించాడు.
అసలేమైందంటే... భారత జట్టు నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా అద్బుతంగా బ్యాటింగ్ చేసింది. 3 వికెట్లు కోల్పోయినా.. సౌతాఫ్రికా సారథి డీన్ ఎల్గర్, బవుమా లు లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ క్రమంలో సఫారీలు విజయానికి చేరువలో (231) ఉండగా.. ఇన్నింగ్స్ 66వ ఓవర్ ను ఠాకూర్ వేశాడు.
ఆ ఓవర్లో ఠాకూర్ రెండో బంతి వేస్తుండగా బ్యాటింగ్ చేస్తున్న బవుమా.. క్రీజునుంచి పక్కకు తప్పుకుని బౌలర్ ను ఆగాలని సూచించాడు. అప్పటికే తాను బాల్ వేసే ఎండ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఠాకూర్.. అంపైర్ దగ్గర ఆగిపోయి అసహనంతో.. ‘what The F**K Man’ అన్నాడు. ఈ మాటలు బౌలర్ ఎండ్ లో ఉండే వికెట్ల మైక్స్ లో రికార్డయ్యాయి.
కాగా, ఠాకూర్ అలా అన్న వెంటనే అంపైర్ అల్లావుద్దీన్ పాలేకర్ వెనుకనుంచి వచ్చి.. ‘భాష, భాష ముఖ్యం..’ అంటూ సున్నితంగా హెచ్చరించాడు. కానీ అప్పటికే అసహనంతో ఉన్న ఠాకూర్.. అంపైర్ ను పట్టించుకోకుండా మళ్లీ బంతి విసరడానికి తన ఎండ్ కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది.
ఇదిలాఉండగా టీమిండియా నిర్దేశించిన 240 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 67.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (96 నాటౌట్), డసెన్ (40), అయిడిన్ మార్క్రమ్ (31), బవుమా (23 నాటౌట్) రాణించారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్ ను 1-1 తో సమం చేసింది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరుదైన మూడో టెస్టు జనవరి 11 నుంచి కేప్టౌన్ లో జరుగనుంది.
