IND vs SA T20I: స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచుల  టీ20 సిరీస్ లో భాగంగా భారత జట్టు నేడు సౌరాష్ట్ర లోని రాజ్‌కోట్‌ లో కీలకమైన నాలుగో మ్యాచ్ ఆడుతున్నది. 

దక్షిణాఫ్రికాతో వరుసగా రెండు మ్యాచులు ఓడి ఆ తర్వాత విశాఖట్నంలో జరిగిన మూడో టీ20లో ఆల్ రౌండ్ షో తో మురిపించిన టీమిండియా.. శుక్రవారం రాజ్‌కోట్‌ వేదికగా నాలుగో మ్యాచ్ లో తలపడుతున్నది. ఇప్పటికే ఈ సిరీస్ లో టీమిండియా 1-2 తో వెనుకబడి ఉంది. సిరీస్ సమం చేసి బెంగళూరు లో జరిగే చివరి మ్యాచ్ లో సఫారీలతో తాడో పేడో తేల్చుకోవాలంటే రాజ్‌కోట్‌ను గెలిచి తీరాల్సిందే. సిరీస్ లో కీలకంగా భావిస్తున్న ఈ మ్యాచ్ లో భారత జట్టు టాస్ ఓడి బ్యాటింగ్ కు రానుంది. ఈ సిరీస్ లో రిషభ్ పంత్ టాస్ ఓడటం ఇది వరుసగా నాలుగోసారి. 

వైజాగ్ టీ20లో ఇచ్చిన ఉత్సాహంతో టీమిండియా సిరీస్ ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. గత మ్యాచ్ లో మాదిరే రాజ్‌కోట్‌ లో కూడా చెలరేగితే సఫారీలకు అడ్డుకట్ట వేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు లో మార్పులేమీ లేవు. కానీ దక్షిణాఫ్రికా తరఫున రబాడా, పార్నెల్ లతో పాటు రీజా హెండ్రిక్స్ కూడా ఆడటం లేదు. గాయం నుంచి కోలుకోవడంతో క్వింటన్ డికాక్, మార్కో జాన్సేన్, లుంగి ఎంగిడి లు తుది జట్టులో చేరారు.

బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తొలి రెండు మ్యాచులలో విఫలమైనా వైజాగ్ లో రుతురాజ్ మెరుపులు మెరిపించాడు. అయితే భారత మిడిలార్డర్ ఇంకా మెరుగవాల్సి ఉంది. శ్రేయస్ అయ్యర్ భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. అతడితో పాటు కెప్టెన్ రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా లు మిడిలార్డర్ భారాన్ని సమర్థంగా మోస్తేనే భారత్ కు విజయావకాశాలు ఎక్కువుంటాయి. చివర్లో దినేశ్ కార్తీక్ ఫినిషింగ్ టచ్ కూడా ఇస్తే భారీ స్కోరు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. 

ఢిల్లీ, కటక్ లో గతి తప్పిన భారత బౌలింగ్ వైజాగ్ లో సెట్ అయింది. వైజాగ్ లో ఒక్క అవేశ్ ఖాన్ తప్ప మిగిలిన ప్రతి ఒక్కరూ ఆకట్టుకున్నారు. భువనేశ్వర్, హర్షల్ పటేల్ తో పాటు స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ కూడా రాణించారు.వీళ్లంతా తిరిగి అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భారత జట్టు కోరుకుంటున్నది. 

ఇక దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. గత రెండు మ్యాచులలో జట్టుకు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తిరిగి జట్టుతో చేరడం సఫారీలకు అదనపు బలం. వన్ డౌన్ లో వచ్చే ప్రిటోరియస్, డసెన్ లు తొలి మ్యాచ్ లో రాణించినా తర్వాత రెండు మ్యాచుల్లో విఫలమయ్యారు. కానీ క్లాసెన్ గత రెండు మ్యాచుల్లో దుమ్ముదులిపాడు. అతడిని అడ్డుకోకుంటే భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇక క్లాసెన్ తో పాటు ప్రమాదకర డేవిడ్ మిల్లర్ కు కూడా వైజాగ్ లో మాదిరి త్వరగా పెవిలియన్ కు పంపితే భారత్ కు తిరుగుండదు.

కాగా.. తొలి రెండు మ్యాచుల్లో నెగ్గి వైజాగ్ లో ఓడిన సఫారీలు సిరీస్ విజయంపై కన్నేశారు. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న సౌతాఫ్రికా.. సిరీస్ ఫలితాన్ని బెంగళూరుకు తీసుకుపోకుండా రాజ్‌కోట్‌ లోనే ముగించాలని భావిస్తున్నది. ఆ మేరకు సఫారీ బౌలర్లు జాన్సేన్, నోర్త్జ్, ఎంగిడి, ప్రిటోరియస్ తో పాటు స్పిన్నర్లు కూడా సిద్ధమయ్యారు. ఇరు జట్లు ఢీ అంటే ఢీ అనుకుంటుండంతో రాజ్‌కోట్‌ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 

తుది జట్లు : 

ఇండియా : ఇషాన్‌ కిషన్, రుతురాజ్, శ్రేయస్, హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్‌ ఖాన్, భువనేశ్వర్, చాహల్ 

సౌతాఫ్రికా : బవుమా (కెప్టెన్‌), డికాక్, వాన్‌ డెర్‌ డసెన్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, జాన్సేన్, లుంగి ఎంగిడి, నోర్జే, షమ్సీ