IND vs SA T20I: సౌతాఫ్రికాతో స్వదేశంలో జరుగతున్న ఐదు మ్యాచుల సిరీస్ లో వరుసగా రెండు మ్యాచులు ఓడిన భారత జట్టు విశాఖపట్నం లో జరిగిన మూడో మ్యాచ్ లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 

"గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస దాని గర్జన కంటే భయంకరంగా ఉంటుంది" అంటాడు కెజిఎఫ్ సినిమాలో ఓ పాత్రదారి. దక్షిణాఫ్రికాతో వరుసగా రెండు మ్యాచులలో ఓడి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడ్డ భారత జట్టు.. కీలకమైన మూడో మ్యాచ్ లో అలాగే గర్జించింది. వరుసగా రెండు మ్యాచులలో ఓడినా మూడో మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ లో రాణించిన భారత జట్టు.. తర్వాత బౌలింగ్ లో సఫారీలకు చుక్కలు చూపించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. భారత్ నిర్దేశించిన 180 పరుగులను ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా.. 19.1 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ కు నాలుగు వికెట్లు దక్కగా.. చాహల్ కు 3 మూడు వికెట్లు తీసి సఫారీల పతనాన్ని శాసించారు. ఫలితంగా భారత జట్టు.. 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.

లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. భువనేశ్వర్ కుమార్ మరోసారి ఆకట్టుకున్నాడు. పిచ్ స్పిన్ కు సహకరిస్తుండటంతో పంత్.. నాలుగో ఓవర్లోనే అక్షర్ కు బంతినిచ్చాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని అక్షర్ వమ్ము చేయలేదు. నాలుగో ఓవర్ ఆఖరి బంతికి అతడు బవుమా (8) ను ఔట్ చేశాడు. 

ఆరో ఓవర్ వేసిన హర్షల్ పటేల్.. చివరి బంతికి మరో ఓపెనర్ హెండ్రిక్స్ (23.. 2 ఫోర్లు, 1 సిక్స్) ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన చాహల్.. డసెన్ (1) ను ఔట్ చేసి దక్షిణాఫ్రికా కు షాకిచ్చాడు. వన్ డౌన్ లో వచ్చిన ప్రెటోరియస్ (16 బంతుల్లో 20.. 2 ఫోర్లు, 1 సిక్స్) ను కూడా చాహల్ 9వ ఓవర్లో ఔట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా.. 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. 

ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇన్ఫామ్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (3).. హర్షల్ పటేల్ బౌలింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో దక్షిణాఫ్రికా ను గెలిపించే బాధ్యత గత మ్యాచ్ లో హీరో క్లాసెన్ (24 బంతుల్లో 29.. 3 ఫోర్లు, 1 సిక్సర్) మీద పడింది. అతడు.. పార్నెల్ (22 నాాటౌట్) తో కలిసి ఆరో వికెట్ కు 29 పరుగులు జోడించాడు. కానీ ప్రమాదకరంగా పరిణమిస్తున్న క్లాసెన్ ను చాహల్ తన బౌలింగ్ కోటాలోని నాలుగో ఓవర్ ఐదో బంతికి ఔట్ చేసి మ్యాచ్ ను దక్షిణాఫ్రికా నుంచి దూరం చేశాడు.

Scroll to load tweet…

ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ కు చేరడంతో లోయరార్డర్ పెద్దగా మెరుపులు మెరిపించలేదు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి 3 ప్రధాన వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ వికెట్ తీసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. హర్షల్ పటేల్ కూడా 4 ఓవర్లలో 3.1 ఓవర్లలో 25 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. భువీకి ఒక వికెట్ దక్కింది. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. భారత జట్టులో రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54), హార్ధిక్ పాండ్యా (31) లు రాణించారు.