IND vs SA T20: సిరీస్ ను కాపాడుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత మిడిలార్డర్  అద్భుతంగా పోరాడింది. ఓపెనర్లు, టాపార్డర్ విఫలమైనా హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ లు ధాటిగా ఆడి భారత్ కు పోరాడే స్కోరునిచ్చారు. 

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా రాజ్‌కోట్‌లో జరుగుతున్న నాలుగో మ్యాచ్ లో టీమిండియా సఫారీల ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లతో పాటు టాపార్డర్ మరోసారి విఫలమైనా మిడిలార్డర్ లో వచ్చిన హార్ధిక్ పాండ్యా (46) తో పాటు దినేశ్ కార్తీక్ (55) లు ధాటిగా ఆడి భారత్ కు పోరాడే స్కోరునిచ్చారు. వీళ్ల పోరాటంతో భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా.. రెండో ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్ ను కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (4) కూడా పేలవ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ పెవిలియన్ కు చేరాడు.

మరోవైపు గత మూడు మ్యాచులలో మాదిరిగానే దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ (27.. 3 ఫోర్లు, 1 సిక్సర్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. వరుసగా రెండు వికెట్లు పడటంతో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (17) కూడా ధాటిగా ఆడేదానికంటే వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యమివ్వడంతో స్కోరు వేగం మందగించింది. తొలి పవర్ ప్లే ముగిసేసరికి 40 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

నోర్త్జ్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి ఇషాన్ కిషన్ కూడా డికాక్ కు క్యాచ్ ఇవ్వడంతో టీమిండియా కష్టాలు రెట్టింపయ్యాయి. దీంతో రిషభ్ కు జత కలిసిన హార్ధిక్ పాండ్యా (31 బంతుల్లో 46.. 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆచితూచి ఆడాడు. వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో పాటు సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల రాక కష్టమైంది. పది ఓవర్లు ముగిసేసరికి భారత స్కోరు 56-3. 

స్కోరు వేగం నెమ్మదిస్తుండటంతో పాండ్యా గేర్ మార్చాడు. షమ్సీ వేసిన 12వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. కానీ ఆ తర్వాత ఓవర్లో రిషభ్ పంత్.. కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో ప్రిటోరియస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

అయితే పంత్ ఔటవడం భారత్ కు మంచే చేసింది. అతడి స్థానంలో వచ్చిన ఫినిషర్ దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 55.. 9 ఫోర్లు, 2 సిక్సర్లు) స్కోరు బోర్డును రాకెట్ వేగంతో ముందుకు తీసుకెళ్లాడు. కార్తీక్ వచ్చాక పాండ్యా కూడా ధాటిగా ఆడాడు. 15 ఓవర్లకు 96-4 గా ఉన్న భారత స్కోరు.. చివరి ఐదు ఓవర్లలో 73 పరుగులు సాధించిందంటే దానికి కారణం కార్తీక్-పాండ్యాలే. 

నోర్త్జ్ వేసిన 16వ ఓవర్లో 3 ఫోర్లతో భారత్ కు 15 పరుగులు రాగా.. ఆ తర్వాత కార్తీక్.. మహారాజ్ వేసిన17వ ఓవర్లో 3 ఫోర్లు కొట్టి 13 పరుగులు రాబట్టాడు. ఇక ప్రిటోరియస్ వేసిన 18వ ఓవర్లో 6,4,4 తో కార్తీక్ చెలరేగాడు.అయితే 19వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్ కొట్టిన పాండ్యా.. తర్వాత బంతికి షమ్సీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయినా ఆ ఓవర్లో 13 రన్స్ వచ్చాయి. ఇక చివరి ఓవర్లో తొలి బంతికి సిక్సర్ కొట్టిన దినేశ్ కార్తీక్.. టీ20లలో తొలి హాఫ్ సెంచరీని సాధించాడు. కానీ తర్వాత బంతికే డసెన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.