Asianet News TeluguAsianet News Telugu

IND Vs SA: టీమిండియా పేస్ గుర్రం బుమ్రాకు 5 వికెట్లు.. భారత్ కంటే తక్కువకే ఆలౌట్ అయిన సఫారీలు

India Vs South Africa 3rd Test Live: దక్షిణాఫ్రికాతో జరుగతున్న  నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా కు ఐదు వికెట్లు దక్కాయి. 
 

Ind vs SA: Jasprit Bumrah takes fifer as India bowl out South Africa for 210
Author
Hyderabad, First Published Jan 12, 2022, 8:21 PM IST

కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించారు.  భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. నాలుగేండ్ల క్రితం తాను అరంగ్రేటం చేసిన గ్రౌండ్ లో ఐదు వికెట్లతో అదరగొట్టగా..  ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ అతడికి తోడ్పాటునందించారు. మరోవైపు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కూడా పడుతూ లేస్తూ..  టీమిండియా తొలి ఇన్నింగ్స్ మాత్రమే  సాగింది. ఆ జట్టులో కీగన్ పీటర్సన్ (72) మినహా మిగిలిన ఆటగాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే వెనుదిరిగారు.   తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 210 పరుగులకు ఆలౌట్ అయింది. 

17 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద  రెండో  రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా కు  ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక అద్భుత బంతితో జస్ప్రీత్ బుమ్రా.. ఎయిడిన్ మార్క్రమ్ (8) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే నైట్ వాచ్ మెన్ కేశవ్ మహారాజ్ (25) ను ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 

ఆ సమయంలో క్రీజులోకి  వచ్చిన కీగన్ పీటర్సన్ (166 బంతుల్లో 72) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో బ్యాటర డసెన్ (21)తో కలిసి అతడు నాలుగో వికెట్ కు 67 పరుగులు జోడించాడు. ఈ ఇద్దరూ వికెట్ పడకుండా అడ్డుకున్నారు. దీంతో లంచ్ సమయానికి భారత్ కు  రెండు వికెట్లే దక్కాయి. 

 

కానీ లంచ్ తర్వాత ఉమేశ్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. లంచ్ తర్వాత అతడు వేసిన  39.2 ఓవర్లో డసెన్.. స్లిప్స్ లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  ఆ తర్వాత టెంబ బవుమా (21) తో కలిసి  పీటర్సన్ దక్షిణాఫ్రికా స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఇదే క్రమంలో ఈ సిరీస్ లో రెండో హాఫ్ సెంచరీ సాధించాడు.   పీటర్సన్-బవుమాలు ఐదో వికెట్ కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ షమీ ఈ  జోడీని విడదీశాడు. షమీ వేసిన బంతిని బవుమా స్లిప్స్ లో విరాట్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆ  జట్టు 159 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 

ఇక ఆ తర్వాత వచ్చినవాళ్లెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లేమీ చేయలేదు. వికెట్ కీపర్ వెరెన్నె డకౌట్ కాగా.. జాన్సేస్ (7), కగిసో రబాడా (15) , ఒలివర్ (10) కాసిన్ని పరుగులు చేసినా భారత తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని మాత్రమే తగ్గించగలిగారే తప్ప టీమిండియా స్కోరును అధిగమించలేదు. ఎంగిడిని బుమ్రా ఔట్ చేయడంతో ఆ జట్టు 76.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 13 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో  భారత్ 223 పరుగుల వద్ద ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.  

 

ఇక భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా కు ఐదు వికెట్లు దక్కగా.. ఉమేశ్ యాదవ్ రెండు, మహ్మద్ షమీకి రెండు వికెట్లు దక్కించుకున్నారు. శార్దూల్ ఠాకూర్  ఒక వికెట్ తీసుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios