Asianet News TeluguAsianet News Telugu

Jasprit Bumrah: నేనెక్కడైతే మొదలుపెట్టానో.. మళ్లీ అక్కడే..! ఆసక్తికర ట్వీట్ చేసిన టీమిండియా పేసర్ బుమ్రా

India Vs South Africa: సిరీస్ విజేతను నిర్ణయించే కీలక మూడో టెస్టుకు  టీమిండియా-దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి. భారత జట్టు తరఫున పేసర్ జస్ప్రీత్ బుమ్రా కు కేప్టౌన్ ఎంతో ప్రత్యేకం. 

Ind VS SA: Jasprit Bumrah pens heartfelt note on return to Cape Town
Author
Hyderabad, First Published Jan 10, 2022, 2:08 PM IST

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు రేపటి నుంచి  సఫారీలతో  తాడో పేడో తేల్చుకోనుంది. కేప్టౌన్ వేదికగా జరుగబోయే మూడో టెస్టులో గెలిచిన వారు సిరీస్ ను గెలుచుకుంటారు. ఈ సిరీస్ లో ఇప్పటికే టీమిండియా, దక్షిణాఫ్రికా తలో టెస్టును గెలుచుకుని  సమంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే భారత జట్టులోని మిగతా ఆటగాళ్లతో పోలిస్తే టీమిండియా పేసర్  జస్ప్రీత్ బుమ్రాకు ఈ టెస్టు ప్రత్యేకం. దీంతో అతడు ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. 

2018లో టీమిండియా.. సఫారీ పర్యటనకు రాగా కేప్టౌన్ లో జరిగిన టెస్టులో బుమ్రా కెరీర్ లో తొలి టెస్టు ఆడాడు. ఇదే విషయాన్ని ట్విట్ఱర్ ద్వారా తెలిపాడు. ట్విట్టర్ వేదికగా.. కేప్టౌన్ లో ప్రాక్టీస్ చేస్తున్న  ఫోటోను షేర్ చేస్తూ... ‘కేప్టౌన్.. జనవరి 2018 - నా టెస్టు క్రికెట్ ఎక్కడైతే మొదలైందో అక్కడే ఉన్నాను.

 

నాలుగేండ్లు గడిచాయి.  ఈ నాలుగేండ్ల కాలంలో నేను  ఆటగాడిగానే గాక వ్యక్తిగా కూడా పరిణితి చెందాను.  ఈ గ్రౌండ్ లోకి తిరిగిరావడం ఆ ప్రత్యేక జ్ఞాపకాలను నెమరువేసుకున్నట్టు ఉంది..’ అని ట్వీట్ చేశాడు.  

నాలుగేండ్ల క్రితం (2018 జనవరి 6న) బుమ్రా.. ఇదే కేప్టౌన్ గ్రౌండ్ లో టీమిండియా తరఫున టెస్టులలో అరంగ్రేటం చేశాడు.  విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు.. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు రాగా అందులో బుమ్రా కూడా సభ్యుడు. ఆ సిరీస్ లో 3 మ్యాచులు ఆడిన బుమ్రా 14 వికెట్లు తీసుకున్నాడు. ఆ పర్యటనలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో.. షమీ (15 వికెట్లు) తర్వాత నిలిచాడు. 

కాగా.. టెస్టు కెరీర్ లో ఇంతవరకు 25 టెస్టులాడిన బుమ్రా.. 23.24 సగటుతో 106 వికెట్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 6-27 గా ఉంది. ఇక ఐసీసీ  పురుషుల టెస్టు బౌలింగ్ ర్యాంకులలో బుమ్రా  ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నాడు. 2019 సెప్టెంబర్ లో బుమ్రా.. మూడో ర్యాంకుకు చేరిన విషయం తెలిసిందే.

ఇదిలాఉండగా.. మూడో టెస్టు జరిగే కేప్టౌన్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ రబాడ, ఎంగిడి, జాన్సేన్ లను తట్టుకుని నిలవడం భారత ఆటగాళ్లకు కఠిన సవాలే.. అదే సమయంలో భారత పేసర్లను ఎదుర్కోవడం సఫారీలకు కష్టమే. కానీ, ఈ పిచ్ మీద టీమిండియాకు రికార్డులు కూడా గొప్పగా ఏం లేవు. కేప్టౌన్ లో గతంలో భారత జట్టు దక్షిణాఫ్రికాను 5 టెస్టులలో ఢీకొంది. ఇందులో  మూడు సార్లు ఓడిపోగా.. రెండుసార్లు డ్రా చేసుకుంది. ఇక 2014 నుంచి ఇక్కడ 7 టెస్టులాడిన సఫారీలు ఇక్కడ ఒక్కటే టెస్టు ఓడారు.

Follow Us:
Download App:
  • android
  • ios