Asianet News TeluguAsianet News Telugu

IND Vs SA: మళ్లీ విఫలమైన టీమిండియా ఓపెనర్లు.. ఆధిక్యం దక్కినా ఆనందం లేని భారత్..

India Vs South Africa 3rd Test Live: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్ లో సఫారీలపై స్వల్ప ఆధిక్యం సాధించేందుకు కృషి చేశారు. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. 
 

Ind Vs SA:  Day 2 Stumps, India lead by 70 runs After Openers Fall Quickly
Author
Hyderabad, First Published Jan 12, 2022, 9:40 PM IST

సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం భారత్ కు ఎంతో సేపు నిలువలేదు.  రెండో ఇన్నింగ్స్  ఆరంభించిన భారత్ కు ఓపెనర్లు మరోసారి పేలవ ఆరంభాన్నిచ్చి ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో మాదిరే రెండో ఇన్నింగ్సులో కూడా  తీవ్ర నిరాశపరిచారు. దక్షిణాఫ్రికాను  ఫస్ట్ ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందాన్ని అంతలోనే ఆవిరి చేశారు.  కానీ  వన్ డౌన్ లో వచ్చిన పుజారా.. కెప్టెన్ కోహ్లి తో జతకలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.  రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్..  17 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 57 పరుగులు చేసింది.  తొలి ఇన్నింగ్స్ తో కలుపుకుని భారత్ మొత్తం 70 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

దక్షిణాఫ్రికాను 210 పరుగుల వద్ద ఆలౌట్ చేసిన టీమిండియా.. 13 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది.  అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 20 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (7).. తొలి ఇన్నింగ్సులో మాదిరే మరోసారి రబాడా బౌలింగ్ లో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్ 4.5 ఓవర్ల వద్ద ఉండగా అతడు నిష్క్రమించాడు.

 

ఇక ఆ  తర్వాత ఓవర్లోనే కెఎల్ రాహుల్ (10) కూడా  పెవిలియన్ బాట పట్టాడు.  జాన్సేన్ బౌలింగ్ లో అతడు మార్క్రమ్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 24 పరుగుల వద్దే రెండు వికెట్లు కోల్పోయింది. 

ఈ సమయంలో  క్రీజలోకి వచ్చిన పుజారా (31 బంతుల్లో 9 నాటౌట్)  కెప్టెన్ కోహ్లి (39 బంతుల్లో 14 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. తొలి ఇన్నింగ్సులో మాదిరే  కోహ్లి సంయమనంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 

అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 210 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్లు సమిష్టిగా రాణించడంతో  ఆ జట్టు కోలుకోలేకపోయింది.  సఫారీ జట్టులో కీగన్ పీటర్పన్ (72) టాప్ స్కోరర్. భారత తొలి ఇన్నింగ్సులో మాదిరే సౌతాఫ్రికా వికెట్లు కూడా క్రమం తప్పకుండా పడ్డాయి. బవుమా (28), కేశవ్ మహారాజ్ (25),  డసెన్ (21) లు కాస్త నిలబడ్డారు. భారత బౌలర్లలో బుమ్రాకు ఐదు వికెట్లు దక్కాయి. ఉమేశ్ యాదవ్ రెండు, మహ్మద్ షమీకి రెండు వికెట్లు దక్కించుకున్నారు. శార్దూల్ ఠాకూర్  ఒక వికెట్ తీసుకున్నాడు.  

విరాట్ కోహ్లి అరుదైన ఘనత : 

 

ఈ టెస్టులో విరాట్ కోహ్లి అరుదైన మైలురాయిని అధిగమించాడు. టెస్టు మ్యాచులలో  వంద క్యాచులు అందుకున్న ఫీల్డర్ గా  రికార్డులకెక్కాడు. మూడో టెస్టులో భాగంగా.. షమీ బౌలింగ్ లో టెంబా బవుమా క్యాచ్ ను అందుకోవడం  ద్వారా కోహ్లి ఈ  ఘనత  సాధించాడు. తద్వారా  టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (164 టెస్టులలో 210 క్యాచులు), వీవీఎస్ లక్ష్మణ్ (125  టెస్టులలో 108), సచిన్ టెండూల్కర్ (200 టెస్టులలో 105), సునీల్ గవాస్కర్ (125 మ్యాచులలో 108), మహ్మద్ అజారుద్దీన్ (99 టెస్టులలో 105)  తర్వాత ఈ ఘనత అందుకున్న ఆరో భారత క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. కోహ్లికి ఇది 99వ  టెస్టు కావడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios