IND vs SA T20I: తొలి టీ20 లో ఓడినందుకు బదులు తీర్చుకోవడంతో పాటు సిరీస్ లో ముందంజ వేయడానికి రిషభ్ పంత్ సేనకు ఇదే చక్కని అవకాశం.
దక్షిణాఫ్రికా తో సిరీస్ ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. కటక్ లోని బారాబతి స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20 లో బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. ఢిల్లీలో జరిగిన మొదటి మ్యాచ్ లో భారీ స్కోరు చేసినా అనూహ్యంగా ఓడిన భారత్.. ఈ మ్యాచ్ లో బౌలింగ్ వైఫల్యాలను సరిదిద్దుకుని సిరీస్ లో బోణీ చేయాలని ఆశిస్తున్నది. ఈ మ్యాచ్ లో టెంబ బవుమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ కు రానుంది. టీమిండియా బ్యాటింగ్ కు రానుంది.
ఢిల్లీ మ్యాచ్ లో బౌలింగ్ వైఫల్యం వల్లే ఓడామని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ కు మార్పులు చేస్తారని ఆశించారంతా..? హర్షల్ పటేల్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ ను ఆడిస్తారని అనుకున్నారు. అయితే భారత్ మాత్రం ఢిల్లీ మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నది. ఇక దక్షిణాఫ్రికాలో మాత్రం 2 మార్పులు జరిగాయి. క్వింటన్ డికాక్ కు గాయమవడంతో అతడి స్థానంలో రీజా హెండ్రిక్స్, వికెట్ కీపర్ హైన్రిచ్ క్లాసెన్ తుది జట్టులోకి వచ్చారు.
ఇక దక్షిణాఫ్రికా విషయానికొస్తే బ్యాటింగ్ లో ప్రిటోరియస్, డసెన్, మిల్లర్ లు చెలరేగితే భారత్ కు మరో ఓటమి తప్పదు. ఈ నలుగురిని ఎంత త్వరగా నిలువరిస్తే భారత్ విజయం అంత సులువవుతంది.
తుది జట్లు :
ఇండియా : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్), హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేశ్ ఖాన్
దక్షిణాఫ్రికా : టెంబ బవుమా (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డ్వేన్ ప్రిటోరియస్, రస్సి వాన్డెర్ డసెన్, డేవిడ్ మిల్లర్, హైన్రిచ్ క్లాసెన్, పార్నెల్, రబాడ, అన్రిచ్ నోర్త్జ్, కేశవ్ మహారాజ, షంషి
