Asianet News TeluguAsianet News Telugu

Virat Kohli: నువ్విక్కడికి రా.. నేనక్కడికొస్తా.. : అంపైర్ పై ఫైర్ అయిన కింగ్ కోహ్లీ

India Vs New Zealand: ఆన్ ఫీల్డ్ లో ఎప్పుడూ అగ్రెసివ్ గా ఉండే విరాట్ కోహ్లీ.. ముంబై టెస్టులో  ఆట మూడో రోజు అంపైర్ పై అసహనం వ్యక్తం చేశాడు. చూస్కోవాలి కదా...? అంటూ అంపైర్ ఫైర్ అయ్యాడు. 

Ind vs Nz: Main udhar aajata hu tum idhar aajao, Virat Kohli mocks at Umpire During Mumbai Test
Author
Hyderabad, First Published Dec 6, 2021, 1:04 PM IST

టీమిండియా-న్యూజిలాండ్ మధ్య ముంబై లో ముగిసిన రెండో టెస్టులో భారత్ 372 పరుగులతో  భారీ విజయం సాధించింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంత భారీ తేడాతో విజయం సాదించడం ఇదే ప్రథమం. కాగా, విజయాజయాలు పక్కనబెడితే ఈ టెస్టు మాత్రం అభిమానులకు అసలైన క్రికెట్ ను పంచింది.  ఈ టెస్టులో  తొలుత మయాంక్ అగర్వాల్  సెంచరీ, అజాజ్ పటేల్ పదివికెట్ల ప్రదర్శన,  తర్వాత అశ్విన్, సిరాజ్ ల మాయాజాలం.. ఇవన్నీ గుర్తు పెట్టుకోదగ్గ జ్ఞాపకాలే. తీపిగుర్తులే కాదు.. ఈ టెస్టులో విరాట్ కోహ్లీ వివాదాస్పద ఔట్ కూడా  చర్చనీయాంశమైంది. అయితే వీటితో పాటు మరో జ్ఙాపకాన్ని కూడా వాంఖడే స్టేడియం మిగిల్చింది. 

రెండో టెస్టులో మూడో రోజు భారత్ 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసి కివీస్  ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపింది. అయితే ఆదిలోనే ఆ జట్టు త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో సీనియర్ ఆటగాడు  రాస్ టేలర్ బ్యాటింగ్ కు వచ్చాడు.  ఆ క్రమంలో అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తున్నాడు. 

న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్  16వ ఓవర్లో టేలర్ కు వేసిన బంతి అతడి బ్యాట్ ను తాకకుండా వెళ్లింది. కీపర్ సాహ కూడా  దానిని మిస్ చేయడంతో టేలర్ పరుగు కోసం  పరిగెత్తాడు. అయితే  అంపైర్ మాత్రం దానిని బైస్ గా కాకుండా టేలర్ బ్యాట్ కు తగిలినట్టుగానే పరిగణించి దానిని బైస్ గా ఇవ్వలేదు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది. 

 

వికెట్ కీపర్ పక్కనే స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ అసహనంతో అంపైర్ ను చూస్తూ.. ‘అరే.. వీళ్లేం చేస్తున్నారు..? నేనొక్కడికొస్తా.. నువ్వు ఇక్కడికి రా...’ అంటూ ఫైర్ అయ్యడు. కోహ్లీ అన్న  మాటలు స్టంప్స్ లో ఉండే రికార్డర్ లో రికార్డ్ అయ్యాయి. దీంతో పాటు  అభిమానుల కోరిక మేరకు కోహ్లీ డాన్స్ కూడా స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

ఇదిలాఉండగా.. తొలి ఇన్నింగ్స్ లో 62 పరుగులకే ఆలౌట్ అయిన కివీస్.. రెండో ఇన్నింగ్సులో 167 పరుగులకే పెవిలియన్ బాట పట్టింది. నాలుగో రోజు ఆట ఆరంభమైన అరగంటలోపే మ్యాచ్ ముగిసింది. జయంత్ యాదవ్, అశ్విన్ లు కివీస్ తోక పని పట్టారు. తాజా  టెస్టు విజయంతో స్వదేశంలో  టీమిండియా వరుసగా 14 సిరీస్ లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios