IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ సీనియర్ ప్లేయర్లు  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ICC Champions Trophy 2025: దుబాయ్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనుండగా.. అందరి దృష్టి మాత్రం టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే ఉంటుంది. ఎందుకంటే వీళ్లిద్దరూ చాలాసార్లు జట్టును గెలిపించారు. అయితే, కీలక సమయాల్లో పరుగులు చేయలేకపోయారు. కప్పు గెలిచినప్పుడు సంతోషంతో, ఓడిపోయినప్పుడు కన్నీళ్లతో కనిపించారు.

వాళ్ల వయసు 37, 36 ఏళ్లు కావడంతో బహుశా వీళ్లిద్దరూ కలిసి ఆడే చివరి ఐసీసీ టోర్నమెంట్ ఇదే కావొచ్చు. సంవత్సరాలుగా వీళ్లిద్దరూ ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ల నుంచి దేశం గర్వించదగ్గ క్రికెటర్లుగా ఎదిగారు. ఇప్పుడు దేశంలోని కోట్లాది మంది ప్రజల ఆశలన్నీ వాళ్ల మీదే ఉన్నాయి.

ఐసీసీ టోర్నీని ఘనంగా ముగిస్తారా?

ఐసీసీ వన్డే నాకౌట్ మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మంచి రికార్డులు కలిగి ఉన్నారు. రోహిత్ 10 మ్యాచ్‌ల్లో 51.00 సగటుతో 459 పరుగులు చేశాడు. ఇందులో 2015 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌పై 137, ఛాంపియన్స్ ట్రోఫీ 2017 సెమీస్‌లో అదే జట్టుపై 123* పరుగులు ఉన్నాయి. 

ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్‌ శర్మ కంటే చాలా మెరుగ్గా రాణించాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 48.18 సగటుతో 530 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2027లో వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై 117 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

2013లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 43 పరుగులు, ఇటీవల జరిగిన ఐసీసీ CT 2025 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 265 పరుగుల ఛేదనలో 84 పరుగులు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై 96* పరుగులు చేశాడు.

రోహిత్, కోహ్లీలు ఫైనల్ మచ్చను చెరిపేస్తారా? 

ఐసీసీ వన్డే ఫైనల్స్‌లో రోహిత్, విరాట్ కోహ్లీల రికార్డులు అంత గొప్పగా ఏం లేవు. విరాట్ నాలుగు ఐసీసీ వన్డే ఫైనల్స్‌లో 34 సగటుతో 137 పరుగులు చేశాడు. అందులో 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్‌లో ఒక హాఫ్ సెంచరీ ఉంది. మిగతా స్కోర్లు 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో శ్రీలంకపై 35, CT 2013 ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 43, CT 2017 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 5 పరుగులు చేశాడు. విరాట్ ఫైనల్స్‌లో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా.. అతని స్థాయికి తగ్గట్టుగా ఆడలేదనే చెప్పాలి.

ఐసీసీ వన్డే ఫైనల్స్‌లో రోహిత్ రికార్డు చాలా దారుణంగా ఉంది. మూడు మ్యాచ్‌ల్లో 18.66 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 2023 ప్రపంచ కప్ ఫైనల్స్‌లో 47 పరుగులు చేశాడు. CT 2013 ఫైనల్స్‌లో 9 పరుగులు చేయగా.. 2017 CT టైటిల్ ఫైనల్స్‌లో పాకిస్థాన్‌పై డకౌట్ అయ్యాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు దిగ్గజాల రికార్డులు బద్దలు కొడతారా? 

ఛాంపియన్స్ ట్రోఫీ, క్రికెట్ ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్‌లలోని అన్ని వైట్-బాల్ ఐసీసీ ఫైనల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే విరాట్ కోహ్లీ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. ఆరు మ్యాచ్‌ల్లో 48.33 సగటుతో 290 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 76 పరుగులు చేశాడు.

మరోవైపు రోహిత్ ఐసీసీ వైట్-బాల్ టోర్నమెంట్ ఫైనల్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో సహా అన్ని ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో రోహిత్ ఆరు ఇన్నింగ్స్‌ల్లో 24.80 సగటుతో 124 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అత్యధిక స్కోరు 47 పరుగులు.

మరి న్యూజిలాండ్ తో జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ హాఫ్ సెంచరీ కరువును తీరుస్తాడా? ఐసీసీ ఈవెంట్ ఫైనల్‌లో సెంచరీ సాధించి సౌరవ్ గంగూలీ (ఐసీసీ నాకౌట్ 2000 ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై) తర్వాత రెండో భారతీయుడిగా విరాట్ కోహ్లీ నిలుస్తాడా లేదా? అనేది తెలియాలంటే ఫైనల్ పోరు ముగిసే వరకు వేచిచూడాల్సిందే ! 

IND vs NZ: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్‌ మ్యాచ్ ను మ‌లుపుతిప్పే టాప్-5 అంశాలు