ICC Under-19 World Cup 2022: గత అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లా చేతిలో ఎదురైన పరాభావానికి భారత జట్టు బదులు తీర్చుకుంది. తొలుత బంగ్లాదేశ్ ను 111 పరుగులకే పెవిలియన్ కు పంపిన యువ భారత్...
వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో యువ భారత్ అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది. తొలుత భారత బౌలర్ల ధాటికి నిలువలేకపోయిన బంగ్లా ఆటగాళ్లు.. తర్వాత బౌలింగ్ లో కూడా తేలిపోయారు. దీంతో 2020 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ లో ఎదురైన పరాభావానికి భారత జట్టు బదులు తీర్చుకుంది. 2020 ప్రపంచకప్ ఫైనల్ లో భారత జట్టును ఫైనల్ లో ఓడించిన బంగ్లాదేశ్.. తొలిసారిగా అండర్-19 ప్రపంచకప్ నెగ్గింది. కాగా, తాజా మ్యాచులో తొలుత బంగ్లాదేశ్ ను 111 పరుగులకే పెవిలియన్ కు పంపిన టీమిండియా.. ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని అందుకుంది. భారత అండర్-19 జట్టు యువ బౌలర్ రవికుమార్ (3/14) తన స్వింగ్ తో బంగ్లాకు చుక్కలు చూపించాడు. తాజా విజయంతో టీమిండియా... ఈ టోర్నీలో సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీస్ లో యువ భారత్.. ఆస్ట్రేలియాను ఢీ కొననుంది.
అంటిగ్వా లోని కూలీడ్జ్ గ్రౌండ్ లో శనివారం ముగిసిన మ్యాచులో తొలుత టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. వారం రోజుల క్రితం కరోనా బారిన పడ్డ యువ భారత కెప్టెన్ యశ్ ధుల్ తిరిగి జట్టులో చేరాడు. ధుల్ నమ్మకాన్ని బౌలర్లు వమ్ము చేయలేదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన రవికుమార్ (7-1-14-3).. తన స్వింగ్ తో మాయ చేశాడు. బంగ్లా కోల్పోయిన తొలి మూడు వికెట్లు అతడు తీసినవే. మూడు పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పయిన బంగ్లాదేశ్.. 50 పరుగులకే ఆరు వికెట్లు నష్టపోయింది.
రవికుమార్ స్వింగ్ తో పాటు స్పిన్నర్ విక్కీ ఓస్త్వాల్ కూడా బంగ్లాను ఇబ్బందులు పెట్టాడు. 9 ఓవర్లు వేసిన విక్కీ.. 25 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. ఆ మాత్రం స్కోరైనా చేసిందంటే అది మెహ్రూబ్ చలవే.. 48 బంతులాడిన అతడు.. 30 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ స్కోరు వంద పరుగులు దాటింది. రవికుమార్, విక్కీతో పాటు కౌశల్ తాంబే, రఘువంశీ, హంగర్గేకర్ లు తలో వికెట్ దక్కించుకున్నారు. భారత బౌలర్ల సమిష్టి కృషి ఫలితంగా బంగ్లాదేశ్ బ్యాటర్లు 37.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయ్యారు.
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత జట్టు ఆదిలోనే ఓపెనర్ హర్నూర్ సింగ్ (0) ను కోల్పోయింది. కానీ ఓపెనర్ రఘువంశీ (44), వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (26) లు రెండో వికెట్ కు 70 పరుగులు జోడించారు. వెంటవెంటనే ఆ ఇద్దరూ నిష్క్రమించినా కెప్టెన్ యశ్ ధుల (20 నాటౌట్), తాంబే (11 నాటౌట్)తో కలిసి పనిపూర్తి చేశాడు. 30.5 ఓవర్లలో 117 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచులో బంగ్లాను కోలుకోలేని దెబ్బ తీసిన రవికుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
కాగా సెమీస్ చేరిన భారత అండర్-19 జట్టు.. ఫిబ్రవరి 2న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఇంగ్లాండ్.. ఫిబ్రవరి 1న తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘాన్ తో తలపడనుంది. ఈ నాలుగు జట్లలో గెలిచిన రెండు జట్టు ఫిబ్రవరి 5న ఫైనల్ ఆడతాయి.
