Asianet News TeluguAsianet News Telugu

Team India Squad: కివీస్ తో సిరీస్ కు సారథిగా రోహిత్ శర్మ.. ఐపీఎల్ హీరోలకు పిలుపు.. హార్ధిక్ కు మొండిచేయి

Team India Squad against New Zealand: ఈనెల 17 నుంచి కివీస్ తో మొదలుకానున్న మూడు టీ20ల సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే రోహిత్ శర్మ ఈ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. 

ICC T20 World Cup 2021: BCCI Announced Team India squad For New zealand series, Rohit Sharma to lead
Author
Hyderabad, First Published Nov 9, 2021, 8:30 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీ20 ప్రపంచకప్ (T0 World cup)లో సూపర్ 12 దశ కూడా దాటకుండానే నిష్క్రమించిన టీమిండియా (Team India).. మరో వారం రోజుల తర్వాత న్యూజిలాండ్ (New Zealand)తో తలపడబోతున్నది. ఇండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడే కేన్ విలియమ్సన్ (Kane Williamson) సేన.. నవంబర్ 17 న  మొదటి టీ20 ఆడనున్నది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ-BCCI) టీ20 జట్టును ప్రకటించింది. టీ20 ఫార్మాట్ నుంచి సారథిగా కోహ్లి (Virat Kohli)వైదొలిగిన నేపథ్యంలో  కివీస్ తో సిరీస్ కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సారథిగా  వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ.. అతడికి బాధ్యతలు అధికారికంగా అప్పగించింది. కెఎల్ రాహుల్ (KL Rahul) కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. టీ20 ప్రపంచకప్ లో దారుణంగా విఫలమైన సీనియర్ ఆటగాళ్లపై బీసీసీఐ వేటు వేసింది. 

న్యూజిలాండ్ (New Zealand Tour OF India)తో సిరీస్ నిమిత్తం జట్టును ఎంపికచేసేందుకు మంగళవారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశమైంది.  ఈ మేరకు కమిటీ.. 16 మందితో కూడిన సభ్యులను ఎంపిక చేసింది. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ తో పాటు దక్షిణాఫ్రికాకు వెళ్లనున్న  ‘ఇండియా-ఎ’ జట్టును కూడా ఎంపిక చేశారు. ఈనెల 23 నుంచి ఈ జట్టు ‘సౌతాఫ్రికా-ఎ’ తో మూడు మ్యాచ్ లు ఆడనున్నది. ఇదిలాఉండగా.. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు మాత్రం జట్టును ఇంకా ప్రకటించలేదు. విరాట్ కోహ్లి విశ్రాంతి కోరడంతో ఆ ఫార్మాట్ లో రోహిత్ గానీ, అజింక్యా రహానే గానీ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.

కాగా.. న్యూజిలాండ్ తో  టీ20 సిరీస్ కు రోహిత్ శర్మ సారథిగా వ్యహరించనుండగా.. రాహుల్ వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. అందరూ ఊహించినట్టుగానే ఐపీఎల్-14 (IPL) లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్ లు జట్టులోకి ఎంపికయ్యారు. టీ20 ప్రపంచకప్ లో విఫలమైన భువనేశ్వర్ కుమార్ ను ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచింది. యుజ్వేంద్ర చాహల్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

 

గత కొద్దికాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్న హర్ధిక్ పాండ్యా కు ఈ సిరీస్ లో చోటు దక్కలేదు. రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి పైనా వేటు పడింది. ఇక జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్ కు రాహుల్ ద్రావిడ్ తాత్కాలిక కోచ్ గా నియమితుడైన విషయం తెలిసిందే. 

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్  కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, ఆర్. అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ 

కాగా న్యూజిలాండ్ జట్టు.. నవంబర్ 17 నుంచి భారత్ తో మూడు టీ20 లుఆడనున్నది. ఆ తర్వాత టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. నవంబర్ 17న జైపూర్ లో తొలి టీ20, రాంచీలో 19న రెండో టీ20, చివరిదైన మూడో టీ20 21 న ఈడెన్ గార్డెన్ లో జరుగుతుంది. ఇక నవంబర్ 25-29 మధ్య కాన్పూర్ లో తొలి టెస్టు.. డిసెంబర్ 3-7 మధ్య రెండో టెస్టు ముంబైలో ఆడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: ఇండియాతో టెస్టు సిరీస్ కు జట్టును ప్రకటించిన న్యూజిలాండ్.. స్పిన్నర్లకే అగ్రతాంబూలం

ఇక దక్షిణాఫ్రికాతో ఇండియా-ఎ జట్టు.. నవంబర్ 23-26 న (నాలుగు రోజులు) తొలి మ్యాచ్, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 దాకా రెండో టెస్టు.. డిసెంబర్ 6-9 దాకా మూడో  టెస్టు ఆడాల్సి ఉన్నది.

దక్షిణాఫ్రికాకు వెళ్లే ఇండియా-ఎ జట్టు: ప్రియాంక్ పంచల్ (కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, బాబా అపరాజిత్, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), కె. గౌతమ్, రాహుల్ చాహర్, సౌరభ్ కుమార్, నవదీప్ సైనీ, ఉమ్రాన్ మాలిక్, ఇషాన్ పొరెల్, అర్జన్ నగ్వస్వల్ల

Follow Us:
Download App:
  • android
  • ios